CM Chandrababu: కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాట్లు, ఎన్నికల వ్యూహాలపై టీడీపీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను పకడ్బందీగా ఎన్నికల వ్యూహాన్ని రూపొందించి, కూటమి ధర్మం ప్రకారం ముందుకు వెళ్తే కొందరు అలగడం ఏమిటని ప్రశ్నించారు. బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యవహారంపై స్పందించిన ఆయన.. బీజేపీ నేతలు ఎందుకు అలిగారని వ్యాఖ్యానించారు. కూటమి ధర్మాన్ని పాటిస్తూ అందరినీ కలుపుకొని ముందుకు వెళ్లామని, సీట్ల సర్దుబాట్లలో అనుకున్న స్థానాలు రాకపోతే అలగడం సరైన పద్ధతి కాదని స్పష్టం చేశారు.
తనపై ప్రభుత్వం, పార్టీతో పాటు కూటమికి సంబంధించిన కీలక బాధ్యతలు కూడా ఉన్నాయని చంద్రబాబు తెలిపారు. అన్ని అంశాలను సమన్వయం చేసుకుంటూ బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పకడ్బందీ వ్యూహంతో ముందుకు వెళ్లామని, కూటమి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు సీఎం చంద్రబాబు.. కాగా, కడప జడ్పీ పీఠం తమకు ఇస్తామని మాట ఇచ్చి.. మళ్లీ మాట తప్పారని ఆరోపిస్తున్న బీజేపీ ఎమ్మెల్యే ఆది నారాయణ రెడ్డి.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమైన విషయం విదితమే.. వరుసగా రెండు రోజులు మీడియాతో మాట్లాడిన ఆయన.. రాజీనామాలపై వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు.. తాను ఢిల్లీ వెళ్లి రాజీనామా చేస్తానని పేర్కొన్నారు.. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో చర్చగా మారాయి..
ఎమ్మెల్యేలకు రియలైజేషన్ టైం.. పనితీరుపై సమీక్ష
మరోవైపు ఎన్నికల ఫలితాలను విశ్లేషించుకుంటున్నామని చంద్రబాబు తెలిపారు. కొంతమంది ఎమ్మెల్యేల పనితీరును ప్రజలు ఆమోదించలేదని పేర్కొన్నారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును సమీక్షించుకుని, ఎక్కడ తప్పులు జరిగాయో తెలుసుకోవడానికి ఇది సమయమని అన్నారు. మంచి, చెడు అంశాలను సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించారు. ప్రజల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని అవసరమైన మార్పులు చేసుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో ఏవైనా లోపాలు ఉన్నట్లు గుర్తిస్తే వాటిని సరిదిద్దుతామని స్పష్టం చేశారు. ఎన్నికల ఫలితాలను గుణపాఠంగా తీసుకుని పార్టీ, ప్రభుత్వం మరింత మెరుగ్గా పనిచేసేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు సీఎం చంద్రబాబు..

