CM Chandrababu: టీడీపీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక సమావేశం నిర్వహించారు. ఇటీవల రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు, పార్టీ నేతలు చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రభుత్వ పరిపాలనపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించారు. సమావేశంలో ముఖ్యంగా కొండపై వైసీపీ నేతలు చేస్తున్న కుట్రలు, తిరుమల పవిత్రతను దెబ్బతీసే ప్రయత్నాలు, కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమం, భోగాపురం ఎయిర్‌పోర్టు, రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన తాజా వ్యాఖ్యలపై నేతలు ప్రస్తావించారు. వైసీపీ నేతలు కుట్రపూరితంగా కొండపై మద్యం బాటిళ్లు పెట్టించి తిరుమల పవిత్రతను భంగం కలిగిస్తున్నారని నేతలు ఆరోపించారు. భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. సీసీ కెమెరాలు, ఆధునిక టెక్నాలజీ సాయంతో వైసీపీ కుట్రలు బయటపడుతున్నా కూడా ఆ పార్టీ నేతలు బరితెగించి వ్యవహరిస్తున్నారని సమావేశంలో అభిప్రాయపడ్డారు.
Read Also: Potatoes: బంగాళాదుంపతో ప్రయోజనాలు..! నాలుగు ప్రధాన అపోహలు..
వైసీపీ చేస్తున్నది కేవలం రాజకీయ దాడి కాదని, హిందూ మతంపై దాడిగా నేతలు అభివర్ణించారు చంద్రబాబు.. అధికారంలో ఉన్నప్పటి నుంచి జగన్ మోహన్ రెడ్డి హిందూ సంప్రదాయాలను నిర్వీర్యం చేసేలా వ్యవహరిస్తున్నారని పలువురు సీనియర్ నేతలు విమర్శించారు. గతంలో దేవాలయాలపై జరిగిన దాడులు, రథం తగులబడిన ఘటన, మూడు సింహాల చోరీ, పరకామణి చోరీ వంటి ఘటనలను నాడు వైసీపీ నేతలు తేలికగా మాట్లాడిన తీరు సమావేశంలో గుర్తు చేశారు. కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారంలో టీటీడీ ఉద్యోగి విజయ్ భాస్కర్ రెడ్డి లంచం తీసుకుని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఆధారాలు లభించాయని నేతలు పేర్కొన్నారు. కీలక స్థానాల్లో ఉన్న నేతలు ఏ మతాన్ని ఆచరించినా ఇతర మతాలను గౌరవించాల్సిందేనని, భక్తుల మనోభావాలకు విలువ ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. అలాగే పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా పాల్గొనాలని సీఎం ఆదేశించారు. నెలలో కనీసం వారం రోజుల పాటు పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాల్లో పాల్గొని, రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేసే దిశగా కూటమి ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రజలకు వివరించాలని సూచించారు.
మరోవైపు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన నీటి సమస్యలపై వ్యాఖ్యలపై కూడా సమావేశంలో చర్చ జరిగింది. గొడవలు వద్దని, రాష్ట్రానికి నీళ్లు కావాలని తాను ఎప్పటి నుంచో చెబుతున్నానని చంద్రబాబు స్పష్టం చేశారు. రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టు, భోగాపురం ఎయిర్‌పోర్టు వంటి కీలక అంశాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పటికే గట్టిగా జవాబు ఇచ్చారని తెలిపారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలకు, ఫేక్ ప్రచారాలకు పార్టీ శ్రేణులు ధీటుగా స్పందించాలని, ప్రజల్లో నిజాలు తీసుకెళ్లాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతలకు దిశానిర్దేశం చేశారు.