Central Team Visits Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో మొంథా తుఫాన్ విధ్వంసమే సృష్టించింది.. ఈ తుఫాన్ నష్టంపై ఏపీ ప్రభుత్వం ఇప్పటికే అంచనా వేసి.. కేంద్రానికి నివేదిక కూడా పంపింది.. అయితే, నేడు, రేపు ఆంధ్రప్రదేశ్‌లోని ‘మొంథా తుఫాన్’ ప్రభావిత జిల్లాల్లో కేంద్ర IMCT బృందం పర్యటించనుంది. కేంద్ర హోంశాఖ జాయింట్ సెక్రటరీ పౌసుమి బసు నేతృత్వంలో ఏడుగురు ఉన్నతాధికారులు ఉన్న ఈ బృందం.. రెండు టీమ్‌లుగా విభజించబడింది. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో తుఫాన్ కారణంగా జరిగిన నష్టాలను పరిశీలించనున్నారు. ఇక, ఉదయం 10 గంటలకు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో అధికారులతో తుఫాన్ ప్రభావం, నష్టాలు, పునరుద్ధరణ చర్యలపై సమీక్ష సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు రాష్ట్ర అధికారులు.
Read Also: AP Cabinet: నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక ప్రతిపాదనలపై ఫోకస్..
అయితే, టీమ్–1 ఈ రోజు బాపట్ల జిల్లాలో పంట నష్టం, గ్రామీణ మౌలిక వసతులను పరిశీలించనుండగా.. టీమ్–2 మాత్రం కృష్ణా, ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల్లో వరి పంటలు, చెరువులు, రహదారుల పరిస్థితిని పరిశీలించనున్నారు.. ఇక, రేపు టీమ్–1 ప్రకాశం జిల్లాలో రైతులతో సమావేశం ఏర్పాటు చేయనుంది.. దెబ్బతిన్న పంట పొలాలు, చెరువుల పరిశీలించనున్నారు.. మరోవైపు, టీమ్–2 కోనసీమ జిల్లాలో అరటి, కొబ్బరి, వరి పంటల నష్టాలన్ని అంచనా వేయనుంది.. రెండు రోజుల పర్యటన అనంతరం సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో.. కేంద్ర బృందం సమావేశమై మొంథా తుఫాన్ ప్రభావం, పునరుద్ధరణ చర్యలపై నివేదిక అందజేయనుంది.