Amaravati ORR: అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సంబంధించి కీలక అప్‌డేట్ వచ్చింది. అమరావతి చుట్టుపక్కల 5 జిల్లాల్లో ఓఆర్ఆర్‌ను నిర్మించనున్నారు. దీని మొత్తం పొడవు 189.9 కిలోమీటర్లు ఉండనుంది. అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ ఆమోదం తెలిపింది. విజయవాడ తూర్పు బైపాస్ అవసరం లేదని తేల్చేసింది. దానికి ప్రత్యామ్నాయంగా రెండు లింక్ రోడ్ల నిర్మాణానికి అవకాశం కల్పించింది. ఉపరితల రవాణా మంత్రిత్వశాఖ ఆమోదం తెలపడంతో.. కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చింది. ఎన్టీఆర్, కృష్ణా, పల్నాడు, గుంటూరు, ఏలూరు జిల్లాల్లోని 23 మండలాలు, 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ వెళ్తుంది. కోల్‌కతా- చెన్నై నెషనల్ హైవే నుంచి ఓఆర్ఆర్కి దక్షిణం, తూర్పు దిశల మధ్యలో రెండు లింక్ రోడ్లను నిర్మిస్తారు. కాజ నుంచి తెనాలి నందివెలుగు వరకు 17 కిలోమీటర్ల మేర ఆరు లేన్ల లింక్ రోడ్లను నిర్మించనున్నారు.
Read Also: Chicken Or Mutton: చికెన్, మటన్ తిన్న తర్వాత వీటిని తింటే ప్రమాదంలో పడినట్లే.. జాగ్రత్త సుమీ!
దీని కోసం మూడు ఎలైన్‌మెంట్లను NHAI సిద్ధం చేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. NHAI నుంచి వచ్చిన ఓఆర్‌ఆర్ ఎలైన్‌మెంట్‌లో స్వల్ప మార్పుచేర్పులతో కూడిన ప్రతిపాదన, రెండు లింక్‌రోడ్ల ఎలైన్‌మెంట్‌ల ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపాక.. వాటిని కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖకు పంపిస్తారు. అక్కడ తుది ఆమోదం తెలుపుతారు. ఇక.. ఓఆర్‌ఆర్ భూసేకరణకు సర్వే నంబర్ల వారీగా త్వరలోనే నోటిఫికేషన్ జారీచేస్తారు. 21 రోజులు గడువిచ్చి అభ్యంతరాలు తెలిపిన వారితో సమావేశాలు నిర్వహించి వారి వినతులు వింటారు. వాటిని పరిష్కరించి.. క్షేత్రస్థాయిలో జాయింట్ మెజర్‌మెంట్ సర్వే చేసి పెగ్ మార్కింగ్ వేస్తారు. అభ్యంతరాలన్నీ పరిష్కారమయ్యాక 3డీ నోటిఫికేషన్ జారీ చేస్తారు. భూసేకరణ ప్రక్రియ జరుగుతుండగానే డీపీఆర్ సిద్ధం చేస్తూనే.. వివిధ అనుమతులను ఎన్‌హెచ్‌ఏఐ ఇంజినీర్లు తీసుకోనున్నారు. మొత్తంగా.. అమరావతి ఓఆర్ఆర్ నిర్మాణంలో కీలక అడుగుపడిందనే చెప్పుకోవచ్చు.