ఎన్టీవీ జర్నలిస్టుల అరెస్టులను ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (ఏపీయూడబ్ల్యూజే) తీవ్రంగా ఖండించింది. ప్రభుత్వంపై విమర్శలు చేయడం, ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడం మాత్రమే కారణంగా జర్నలిస్టులను అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి. సుబ్బారావు తీవ్రంగా తప్పుబట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెర్చ్ వారెంట్ లేకుండా చానెల్ కార్యాలయంలోకి పోలీసులు ప్రవేశించి సోదాలు నిర్వహించడం పూర్తిగా అన్యాయమని అన్నారు. పండుగ సమయంలో అర్ధరాత్రి వేళ జర్నలిస్టుల ఇళ్లలోకి వెళ్లి తలుపులు పగలగొట్టి అరెస్టులు చేయడం చట్ట విరుద్ధమని స్పష్టం చేశారు.
Read Also: KTR: జర్నలిస్టుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేయడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటు
నిర్దిష్ట విధి విధానాలను పాటించకుండా, ముందస్తు నోటీసులు ఇవ్వకుండా జర్నలిస్టులను అరెస్టు చేయడం తీవ్ర అన్యాయమని పేర్కొన్నారు సుబ్బారావు.. ఇది పత్రికా స్వేచ్ఛపై ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. జర్నలిస్టులపై కక్ష్య సాధింపు చర్యలకు దిగడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు. టెలికాస్ట్ అయిన వార్తలపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే, వాటిని ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలో ఫిర్యాదు చేయాల్సిందే తప్ప జర్నలిస్టులను అరెస్టు చేయడం సరికాదన్నారు.. ఎన్టీవీ ఇన్‌పుట్ ఎడిటర్ దొంతు రమేష్, రిపోర్టర్ సుధీర్‌ను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని ఏపీయూడబ్ల్యూజే డిమాండ్ చేసింది.