KTR on Journalist Arrests: జర్నలిస్టుల ఇళ్లపై అర్ధరాత్రి దాడులు చేయడం, వారిని నేరస్థులలా తీసుకెళ్లడం ప్రజాస్వామ్యానికే సిగ్గుచేటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తాజాగా ఈ అంశంపై ఆయన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ఓ ట్వీట్ చేశారు. తెలంగాణలో ప్రస్తుత కాంగ్రెస్ పాలన నాటి చీకటి రోజులను, ఎమర్జెన్సీ అణచివేత ధోరణిని గుర్తుకు తెస్తోందన్నారు. బెయిలబుల్ సెక్షన్లు ఉన్నప్పుడు నోటీసులు ఇచ్చి విచారణకు పిలవాలి కానీ, ఇలా భయోత్పాతం సృష్టించడం దేనికి సంకేతం? అని నిలదీశారు. అర్ధరాత్రి పూట పోలీసుల హడావుడితో జర్నలిస్టుల కుటుంబాలను, పిల్లలను భయభ్రాంతులకు గురిచేయడం అత్యంత దారుణమన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కేయడమే లక్ష్యంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని.. ఇది పత్రికా స్వేచ్ఛను ఖూనీ చేయడమే అన్నారు. పోలీసు యంత్రాంగం అధికార పార్టీకి తొత్తులుగా మారకూడదని.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు స్వస్తి పలికి, చట్టబద్ధంగా వ్యవహరించాలని సూచించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన జర్నలిస్టులను తక్షణమే విడుదల చేయాలని మరియు వారిపై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.