Nara Lokesh: హస్తిన పర్యటనలో ఉన్న ఏపీ విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ బిజీ బిజీగా గడుపుతున్నారు.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తో సమావేశమైన లోకేష్.. ఏపీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోసం నిర్మాణాత్మక సంస్కరణలను అమలు చేస్తున్నామని తెలిపారు.. ఈ సందర్భంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యాప్రమాణాల మెరుగుదలకు చేపడుతున్న సంస్కరణలను కేంద్రమంత్రికి వివరించారు. ఇందులో భాగంగా ఎడ్యుకేషన్ ఎకో సిస్టమ్ అభివృద్ధికి లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ (LEAP) కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా విద్యాప్రమాణాల మెరుగుదలకు 9600 మోడల్ ప్రైమరీ స్కూళ్లను ఏర్పాటుచేసి, వన్ క్లాస్ – వన్ టీచర్ విధానాన్ని అమలు చేస్తున్నాం. అత్యుత్తమ మౌలిక సదుపాయాలతో ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒకటి చొప్పున 175 లీప్ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. 700 యూపీ స్కూళ్లను హైస్కూళ్లుగా అప్ గ్రేడ్ చేశాం. అకడమిక్, ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ఆధారంగా పాఠశాలలకు స్టార్ రేటింగ్ ఇస్తున్నాం. ఎటువంటి రాజకీయం జోక్యం లేకుండా టీచర్ ట్రాన్స్‌ఫర్ యాక్ట్ తెచ్చి సీనియారిటీ ప్రాతిపదికను ఉపాధ్యాయులకు పదోన్నతులు, బదిలీలను విజయవంతంగా పూర్తిచేశామని తెలిపారు.
Read Also: Hyderabad Traffic Police – Prabhas: అబ్బా.. అబ్బా.. ఏమి వాడకం అయ్యా!
ఇక, రాష్ట్రంలో కొత్తగా 80 పీఎంశ్రీ స్కూళ్లు, పీఎం జన్ మన్ పథకం కింద 79 హాస్టళ్లు మంజూరుచేశారు, స్టెమ్ ల్యాబ్స్, కంప్యూటర్ ల్యాబ్స్ కోసం రూ.186కోట్లు అందించి విద్యారంగ అభివృద్ధికి సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు లోకేష్. మనబడి – మన భవిష్యత్తు కార్యక్రమం ద్వారా పీఎంశ్రీ స్కూళ్లను అభివృద్ధి చేస్తున్నాం. కేంద్ర ప్రభుత్వ సహకారంతో 125 ఆటిజం స్కూళ్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నాం. విద్యాభివృద్ధిలో తల్లిదండ్రులను భాగస్వాములుగా చేసేందుకు జులై 5న రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్ – టీచర్స్ మీట్ ను నిర్వహిస్తున్నాం. విద్యార్థుల పనితీరును వాట్సాప్ ద్వారా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు తెలియజేస్తున్నాం. పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనలో స్కూలు మేనేజ్ మెంట్ కమిటీలను భాగస్వాములను చేస్తున్నాం. విద్యారంగ అభివృద్ధికి సలహాల కోసం ప్రతివారం టీచర్స్ యూనియన్లు, ఉత్తమ ఉపాధ్యాయులతో సమావేశమవుతున్నాం. జూలై 5 న జరిగే మెగా పీటీఏం కార్యక్రమానికి హాజరుకావాలని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ను లోకేష్ ఆహ్వానించారు . ఆగస్ట్ లో విద్యా శాఖ మంత్రుల కాంక్లేవ్ ఏర్పాటు కు ఆంధ్రప్రదేశ్ కు అవకాశం ఇవ్వాలని లోకేష్ కోరగా అందుకు ధర్మేంద్ర ప్రధాన్ అంగీకరించారు.
Read Also: Chevireddy Bhaskar Reddy: నా అరెస్ట్ అక్రమం.. నోటీసు కూడా ఇవ్వలేదు..
ప్రభుత్వ పాఠశాలల్లో లెర్నింగ్ అవుట్ కమ్స్ కు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నాం. ఇందులో భాగంగా ప్రైమరీ స్కూళ్లలో గ్యారంటీడ్ ఎఫ్ ఎల్ ఎన్ (ఫౌండేషనల్ లిటరసీ, న్యూమరసీ) ప్రోగ్రామ్ ను అమలు చేయబోతున్నాం అని తెలిపారు లోకేష్. యాక్టివ్ లెర్నింగ్ లో భాగంగా క్లిక్కర్స్, సమ్మరీ వీడియోలు, ప్రిస్క్రిప్టివ్ హోం వర్క్, పాల్ మోడల్ ను అమలు చేయబోతున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 30 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో వెనుకబడిన విద్యార్థుల కోసం విద్యాశక్తి కార్యక్రమాన్ని అమలు చేస్తున్నాం. సెమిస్టర్ వైజ్ టెక్స్ట్ బుక్స్, ఎసెస్ మెంట్ బుక్ లెట్స్ అందజేస్తున్నాం. రాబోయే మూడేళ్లలో నూరుశాతం అక్షరాస్యత సాధనే లక్ష్యంగా ప్రాజెక్టు అ, ఆ (అక్షర ఆంధ్ర)ను ఏర్పాటుచేశాం. విద్యార్థుల సమగ్రాభివృద్ధి, సంక్షేమం కోసం పలు చర్యలు చేపడుతున్నాం. నూరుశాతం ఎన్ రోల్ మెంట్, చైల్డ్ ట్రాకింగ్ కోసం 85శాతం అపార్ ఐడి నమోదును ఇప్పటికే పూర్తిచేశాం. విద్యార్థుల్లో నైతిక విలువల పెంపుదల, లింగసమానత్వంపై ప్రముఖ ఆధ్యాత్మికవేత్త చాగంటి కోటేశ్వరరావు ద్వారా ప్రత్యేకంగా రూపొందించిన పుస్తకాలను, రాజ్యాంగంపై అవగాహన కోసం బాల రాజ్యాంగాన్ని విద్యార్థులకు అందించబోతున్నాం. విద్యార్థుల్లో మానసిక వికాసం కోసం పాఠశాలల్లో యోగా, ఎన్ సిసి, ఎన్ ఎన్ ఎస్, ఎన్ జిసి, సెల్ఫ్ డిఫెన్స్ శిక్షణ ఇస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే గా ప్రకటించి, స్పోర్ట్స్, ఇతర విద్యేతర కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నాం. యాంటీ డ్రగ్ క్యాంపెయిన్ లో భాగంగా డ్రగ్స్ వద్దు బ్రో పేరుతో చైతన్యవంతం చేస్తున్నాం. ప్రతిభకలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు షైనింగ్ స్టార్స్ పేరిట సత్కరిస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల కోసం 255 మెంటల్ హెల్త్ కౌన్సిలర్లను ఏర్పాటుచేశామని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌కు వివరించారు ఏపీ మంత్రి నారా లోకేష్..