Pawan Kalyan New Strategy: జనసేన పార్టీ భవిష్యత్తు దిశలో కీలకమైన అడుగుగా పవన్ కల్యాణ్ మాస్టర్ స్కెచ్ వేశారు.. అదే త్రిశూల వ్యూహం.. అయితే, జనసేనాని రూపొందించిన త్రిశూల వ్యూహం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసింది. మూడు దిశల్లో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో రూపొందిన ఈ వ్యూహం.. పార్టీ భవిష్యత్తు దిశను, కూటమి సమీకరణాలను ప్రభావితం చేసే ప్రయత్నంగా కనిపిస్తోంది. ఈ త్రిశూల వ్యూహం మూడు ప్రధాన అంశాలపై సాగుతోంది.. ప్రభుత్వంలో పాత్ర, పార్టీ బలపరచడం, ప్రజా సంబందాలు.. మొదటిగా ప్రభుత్వ వ్యవహారాల్లో చురుకుగా పవన్ కల్యాణ్ ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాల్లో పాల్గొంటున్నారు. ప్రజా సమస్యలను ప్రభుత్వస్థాయిలో పరిష్కరించడమే కాకుండా.. జనసేన హామీల అమలుపై కూడా దృష్టి సారిస్తున్నారు. రెండవది పార్టీ బలపరచడం. ఎన్నికల తరువాత కూడా కేడర్ మోటివేషన్ నిలబెట్టడం, బూత్ స్థాయి దాకా పార్టీలో చైతన్యం కొనసాగించడం మీద ఫోకస్ చేస్తున్నారు. సమన్వయకర్తలకు నేరుగా సూచనలు ఇచ్చి, పార్టీని వ్యవస్థీకృత దిశగా నడిపించే ప్రయత్నం కనిపిస్తోంది. మూడవది ప్రజా సంబంధం. అధికారంలో ఉన్నప్పటికీ ప్రజల మనసుకు దగ్గరగా ఉండే విధంగా పవన్ కల్యాణ్ వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో పర్యటనలు, ప్రజా సమావేశాలు, సమస్యలపై వెంటనే స్పందించడం ఇవన్నీ ఈ వ్యూహం భాగంగానే చూస్తున్నారు విశ్లేషకులు.
Read Also: Israel-Hamas: నేడు ఈజిప్టు వేదికగా హమాస్-ఇజ్రాయెల్ కీలక చర్చలు.. బందీల విడుదలపై వీడనున్న ఉత్కంఠ
అయితే ఈ వ్యూహం అమలులో సవాళ్లు తక్కువ కావు. కూటమిలో సమతుల్యత కాపాడటం, ప్రభుత్వ నిర్ణయాలపై జనసేన పార్టీ తరుపున గ్యారంటీ ఇవ్వడం, అంతర్గత అసంతృప్తిని అదుపులో ఉంచడం ఇవన్నీ పవన్ కల్యాణ్ ముందున్న ప్రధాన పరీక్షలుగా మారాయి. జనసేన త్రిశూల వ్యూహం సరైన రీతిలో అమలైతే.. పార్టీ కేవలం కూటమి భాగస్వామిగా కాకుండా, భవిష్యత్తులో నిర్ణయాత్మక శక్తిగా మారే అవకాశం ఉంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ఇక ఈ వ్యూహం కేవలం రాజకీయంగా మాత్రమే కాదు, పవన్ కల్యాణ్ ఇమేజ్ మేనేజ్‌మెంట్ స్ట్రాటజీగానూ భావిస్తున్నారు. ప్రజలతో అనుసంధానం కొనసాగిస్తూనే, ప్రభుత్వంలో తన పాత్రను నిరూపించుకోవడం ఇదే ఈ త్రిశూల వ్యూహం అసలు బలంగా భావిస్తున్నారు విశ్లేషకులు. మొత్తానికి పవన్ కల్యాణ్ త్రిశూల వ్యూహం ఇప్పటివరకు సమతుల్యతతో సాగుతోంది. కానీ, ఈ వ్యూహం నిజంగా వర్కౌట్ అవుతుందా.. ? లేక ఆచరణలో అడ్డంకులు ఎదుర్కుంటుందా ..? అనే ప్రశ్నలకు సమాధానం రాబోయే నెలల్లో రాజకీయ పరిణామాలు చెబుతాయి.