CM Chandrababu: సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరిగిన తెలుగుదేశం పార్లమెంటరీ పార్టీ సమావేశంలో పలు రాజకీయ అంశాలపై చర్చించారు. భేటీలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఏపీ సీఎం చంద్రబాబు ఎంపీలకు వివరించారు. జగన్ ఏ విధంగా ఆర్థిక వ్యవస్థను నాశనం చేశారనే విషయాన్ని ఎంపీలకు సీఎం చంద్రబాబు వివరించినట్లు సమాచారం. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టాలంటే కేంద్ర నిధులను తేవడం చాలా కీలకమని ఎంపీలకు చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ చెప్పేవన్నీ తప్పుడు విషయాలనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా చేయాలని ఎంపీలకు సూచించారు. అనవసర విషయాలపై మన ఫోకస్ పెట్టేలా రాజకీయం చేసే జగన్ ఉచ్చులో పడకూడదన్నారు.
Read Also: Minister Savitha: బీసీ సంక్షేమ హాస్టళ్లలో పిల్లలకు ఇబ్బంది కలిగితే క్షమించేది లేదు..
సీఎం చంద్రబాబు మాట్లాడుతూ..”జగన్ పోతూ పోతూ ఖజానా మొత్తం ఖాళీ చేసి పోయాడు. ఒకట్రెండు కార్పొరేషన్లకే నిధులన్నీ మళ్లించేశాడు. కేంద్రం నుంచి వచ్చే నిధులు రాకుండా చేశారు. గత ప్రభుత్వ వైఖరి వల్ల రాష్ట్రం ఆర్థికంగా పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. రాష్ట్రాభివృద్ధిని సవాల్‌గా తీసుకుని నిర్మాణాత్మకంగా పని చేద్దాం. అసెంబ్లీ నుంచి పారిపోయేందుకే జగన్ ఢిల్లీ డ్రామాలు. శాంతి భద్రతలపై ప్రభుత్వం పెట్టే శ్వేతపత్రంలో వాస్తవాలు ఎదుర్కొనే ధైర్యం జగన్‌కు లేదు. గంజాయి, మాదకద్రవ్యాల సంస్కృతి వల్లే ఈ అనర్ధాలు. వినుకొండ హత్య గంజాయి ప్రభావం వల్లే జరిగిందని వైసీపీ నేతలే ఒప్పుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో నేతలంతా క్రమశిక్షణగా వ్యవహరించాలి. వైసీపీ అబద్ధపు విష ప్రచారాన్ని సమర్థంగా తిప్పికొడద్దాం.”అని ఆయన అన్నారు.