Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ

Krmb

Krmb

Krishna River Management Board: కృష్ణా నదీ జలాల వినియోగం, నీటి పంపకాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ మేరకు కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) ఛైర్మన్‌కు జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేఖ రాశారు. శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలపై అత్యవసరంగా చర్చించేందుకు బోర్డు సమావేశం నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు. ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో ఈ ఏడాది నీటి లభ్యతపై అనిశ్చితి ఉండే అవకాశం ఉన్నందున, అందుబాటులో ఉన్న నీటిని అత్యంత జాగ్రత్తగా వినియోగించాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి వాటాలను స్పష్టంగా ఖరారు చేసి, తగిన నిర్ణయం తీసుకోవాలని కోరింది.

కృష్ణా జలాల పంపకాలే ఏకైక అజెండాగా కేఆర్ఎంబీ సమావేశం లేదా త్రిసభ్య కమిటీ సమావేశాన్ని అత్యవసరంగా ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించింది. రెండు రాష్ట్రాల మధ్య నీటి వినియోగంపై స్పష్టత తీసుకురావడంతో పాటు భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని తక్షణ నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని లేఖలో పేర్కొంది. కృష్ణా జలాల వినియోగంపై త్వరితగతిన చర్చలు జరగాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది.