Ambati Rambabu Controversy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అరెస్ట్.. వరుస కేసుల వ్యవహారం కాక రేపుతోంది.. అయితే, శాసనమండలిలో అంబటి రాంబాబు వివాదంపై తీవ్ర వాగ్వాదం జరిగింది. మంత్రి నారా లోకేష్ మరియు మండలి విపక్షనేత బొత్స సత్యనారాయణ మధ్య మాటల తూటాలు పేలాయి. మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, అంబటి రాంబాబు.. ముఖ్యమంత్రి తల్లిని అవమానించారని ఆరోపించారు. మహిళలను కించపరిచే విధానం సరికాదన్నారు. “ఎవరి తల్లినైనా, మహిళనైనా అవమానిస్తే వదిలిపెట్టం. ముందు ముందు మీరు చూస్తారు” అని హెచ్చరించారు. నెల్లూరులో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ, తమ కార్యకర్తలపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు చర్యలు తీసుకున్నామని తెలిపారు.
దీనికి స్పందించిన బొత్స సత్యనారాయణ, అంబటి రాంబాబుపై దాడి జరిగిన తర్వాత ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారని, అనంతరం వాటిపై పశ్చాత్తాపం వ్యక్తం చేసి క్షమాపణలు చెప్పారని తెలిపారు. ప్రజాస్వామ్యంలో దాడులు చేయడం కూడా తప్పేనని ప్రశ్నించారు. “అంబటి రాంబాబు తల్లి తల్లి కాదా? తల్లి ఎవరికైనా తల్లే. మహిళ విషయంలో ఎవరు తప్పు చేసినా తప్పే” అని వ్యాఖ్యానించారు. ఇంకో మాజీ మంత్రి ఇంటిపై పెట్రోల్ బాంబులు వేసిన ఘటనను కూడా ప్రస్తావించారు. మహిళలను రాజకీయ మైలేజ్ కోసం ఉపయోగించకూడదని అన్నారు.
ఈ వ్యవహారంపై హోంమంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ.. శాంతి భద్రతలపై చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. అంబటి రాంబాబు తల్లిని దూషించినట్లు ఆధారాలు ఇస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. మాజీ మంత్రిగా ఉన్న వ్యక్తి మాట్లాడే మాటల్లో బాధ్యత ఉండాలని సూచించారు. ఈ ఘటనతో శాసనమండలిలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.