Amaravati Land Pooling: కూటమి ప్రభుత్వం అమరావతి రాజధాని అభివృద్ధిపై ఫోకస్ పెట్టింది.. గతంలో సేకరించిన భూములతో పాటు.. ఇప్పుడు కొత్తగా మరిన్ని భూములు సేకరించేందుకు శ్రీకారం చుట్టారు.. ఇక, అమరావతి రాజధాని ప్రాంత రైతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భారీ ఊరటనిచ్చింది. ల్యాండ్ పూలింగ్ పథకంలో కొత్తగా భూములు ఇచ్చిన రైతు కుటుంబాలకు 1.5 లక్షల రూపాలయ వరకు రుణమాఫీ వర్తింపజేయనున్నట్లు మంత్రి నారాయణ ప్రకటించారు. అయితే, ఈ మాఫీ నిన్నటి వరకూ ఉన్న వ్యవసాయ రుణాలకు మాత్రమే వర్తిస్తుందని, కొత్తగా తీసుకునే రుణాలకు ఇది వర్తించదని ఆయన స్పష్టం చేశారు.
Read Also: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల కోసం సిద్ధమైన ఈసీ.. కలెక్టర్లకు కీలక ఆదేశాలు
అమరావతి మండలం ఎండ్రాయి గ్రామంలో ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను అధికారికంగా ప్రారంభించారు మంత్రి నారాయణ. ఈ సందర్భంగా గ్రామ రైతులు మంత్రి, ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ కుమార్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేతో కలిసి రైతులతో సమావేశం నిర్వహించిన మంత్రి, ల్యాండ్ పూలింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రభుత్వం చేపట్టనున్న అభివృద్ధి ప్రణాళికలపై వివరించారు. ఎండ్రాయిలో ల్యాండ్ పూలింగ్ కాంపిటెంట్ అథారిటీ కార్యాలయాన్ని మంత్రి నారాయణ, ఎమ్మెల్యే ప్రవీణ్ కుమార్, CRDA కమిషనర్ కన్నబాబు కలిసి ప్రారంభించారు. అదే రోజు 400 ఎకరాలకు చెందిన రైతులు అంగీకార పత్రాలు సమర్పించి, తమ భూములను ల్యాండ్ పూలింగ్‌కు ఇచ్చేందుకు ముందుకొచ్చారు. ఈ భూముల అంగీకార పత్రాలను రైతులు స్వయంగా మంత్రి నారాయణకు అందజేశారు. ఎండ్రాయి గ్రామంలో మొత్తం 1925 ఎకరాల భూమిని సమీకరించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ల్యాండ్ పూలింగ్‌కు రైతులు చూపుతున్న స్పందన పట్ల మంత్రి నారాయణ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు.
ఈ సందర్భంగా మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు.. ల్యాండ్ పూలింగ్‌లో భూములు ఇచ్చిన ప్రతి రైతు కుటుంబానికి ₹1.5 లక్షల రుణమాఫీ చేస్తాం.. ఈ మాఫీ నిన్నటి వరకు ఉన్న రుణాలకే పరిమితం అ న్నారు.. రైతులు కోరినట్లుగా కౌలు పెంపునకు సీఎం చంద్రబాబు అంగీకరించారని తెలిపారు.. భూములు సమీకరించిన మూడు నెలల్లో మాస్టర్ ప్లాన్ పూర్తి చేస్తాం అన్నారు.. ఏడాదిలోనే ఎండ్రాయిలో ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ నిర్మాణం ప్రారంభిస్తాం.. ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా అభివృద్ధి చేసి చూపిస్తాం అని స్పష్టం చేశారు.. ఎండ్రాయిలో ప్రతిపాదిత ఇంటర్నేషనల్ స్పోర్ట్ సిటీ ప్రాజెక్ట్ అమరావతి భవిష్యత్తు అభివృద్ధిలో కీలక మైలురాయిగా నిలుస్తుందని మంత్రి తెలిపారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా యువతకు క్రీడా అవకాశాలు, ఉపాధి, మౌలిక సదుపాయాల అభివృద్ధి పెద్దఎత్తున జరుగుతుందని వివరించారు. ఇక, ల్యాండ్ పూలింగ్‌లో భాగంగా రైతులు ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్, పరిహారం, కౌలు చెల్లింపుల ప్రక్రియను పారదర్శకంగా, వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు మంత్రి నారాయణ.