ఉక్రెయిన్ లో యుద్ధ వాతావరణం నెలకొంది. రష్యా ఉక్రెయిన్ పై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ చిక్కుకున్న కొంత మంది విద్యార్థులతో ఫోన్ లో మాట్లాడామని, వారిని అన్నివిధాలుగా ఆదుకుంటామన్నారు ఏపీ విద్యామంత్రి ఆదిమూలపు సురేష్. అక్కడ సుమారు 4 వేల మంది విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. ఉక్రెయిన్ లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులకు సహకారం అందించటానికి ఇద్దరు అధికారులను నియమించింది ఏపీ ప్రభుత్వం. నోడల్ అధికారిగా రవి శంకర్ 9871999055. ఏపీ భవన్. అంతర్జాతీయ సహకారం ప్రత్యేక అధికారిగా రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ గీతేష్ శర్మ. సంప్రదించాల్సిన నెంబర్ 7531904820 కూడా అందుబాటులోకి తెచ్చింది.
ఎన్టీవీతో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ రిటైర్డ్ ఐఎఫ్‌ఎస్ గీతేష్ శర్మను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక అధికారిగా అపాయింట్ చేశాం. ఏపీ భవన్ లో ఒక నోడల్ అధికారిని సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించాం. వీరు ఉక్రెయిన్ లో ఉన్న విద్యార్థులతో టచ్ లో ఉన్నారు. ఉక్రెయిన్‌లో జఫ్రూషా స్టేట్ మెడికల్ యూనివర్సిటీ లో ఎక్కువ మంది తెలుగు విద్యార్థులు వైద్య విద్య అభ్యసిస్తున్నారు. విమానాలు రద్దు అవుతున్న నేపథ్యంలో ఎక్కువ ఆందోళన నెలకొంది. ఇండియన్ ఎంబసీ ఇచ్చే సూచనలను విద్యార్థులు కచ్చితంగా పాటించాలన్నారు మంత్రి సురేష్. నిషేధిత ప్రాంతాలకు వెళ్ళకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖతో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సమన్వయంతో వుందన్నారు.
ఇదిలా వుంటే ఉక్రెయిన్ దేశంలో ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న తెలుగు రాష్ట్రాలకు చెందిన 29 మంది విద్యార్థులు వున్నారు. ఉక్రెయిన్ లో చదువుతున్న తమ పిల్లలను క్షేమంగా భారతదేశానికి తీసుకు రావాలని ప్రధాని మోదీకి ట్విట్టర్లో మెసేజ్ చేస్తున్నారు విద్యార్థుల తల్లిదండ్రులు. తమ పిల్లల గురించి తమకెంతో ఆందోళనగా వుందన్నారు.