హక్కుల కోసం ఉద్యమిస్తే అరెస్టులు చేస్తారా అంటూ ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.టీడీపీ 43% పిఆర్సీ ఇస్తే తప్పుబట్టిన జగన్ రెడ్డి ఈరోజు అసలు వేతనాలకే ఎసరు పెట్టారన్నారు. ఉద్యోగుల న్యాయమైన కోర్కెలను పరిష్కరించాల్సింది పోయి అరెస్టులు చేయడం సిగ్గుచేటన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉందని కాగ్ నివేదికలు చెబుతున్నా ఆదాయం లేదంటూ ఉద్యోగుల పొట్ట కొట్టడం దుర్మార్గమన్నారు.
ఉద్యోగులకు ఇచ్చిన హమీల్లో రెండున్నరేళ్లలో ఒక్క హామీని కూడా అమలు చేయకుండా ఉద్యోగులకు మొడి చేయి చూపారని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. కాంట్రాక్టు ఉద్యోగులని క్రమబద్దీకరిస్తామని చెప్పి వారి ఆశలకు జగన్ సమాధి కట్టారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల న్యాయ పోరాటానికి టీడీపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని అచ్చెన్నాయుడు ప్రకటించారు. ఇప్పటికైనా జగన్ ప్రభుత్వం పీఆర్సీ విషయమై పునారాలోచించుకోవాలని అచ్చెన్నాయుడు సూచించారు.