Amaravati Assigned Lands Case: ఏపీ రాజధాని అసైన్డ్ ల్యాండ్ స్కామ్ కేసులో ఐదుగురిని సీఐడీ ఈరోజు మధ్యాహ్నం అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. నిందితుందరినీ సీఐడీ అధికారులు ఏసీబీ కోర్టు ఎదుట హాజరుపరిచారు. అయితే వీరిలో ఇద్దరు నిందితులు కొల్లి శివరాం , గట్టెం వెంకటేష్‌ను రిమాండ్‌కు పంపేందుకు ఏసీబీ కోర్టు జడ్జి తిరస్కరించారు. ఎఫ్ఐఆర్‌లో సీఐడీ నమోదు చేసిన రెండు సెక్షన్లు కేసుకు వర్తించవని.. 41 ఏ నోటీసులు ఇచ్చి పంపాలని జడ్జి ఆదేశించారు. ఈ కేసుకు ఎస్సీ, ఎస్టీ చట్టం వర్తించదని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అయితే మిగతా సెక్షన్ల కింద ఏడేళ్లలోపు శిక్ష పడే అవకాశం ఉందని కోర్టు అభిప్రాయపడింది.
కాగా రాజధాని అమరావతి ప్రాంతంలో 1100 ఎకరాల మేర అసైన్డ్ భూములలో అక్రమాలు జరిగాయని సీఐడీ అభియోగం మోపింది. రాజధాని పరిధిలోని వేర్వేరు గ్రామాల్లో 89.8 ఎకరాల అసైన్డ్ భూములు కొనుగోలు చేసినట్లు సీఐడీ ఆరోపించింది. వేర్వేరు సర్వే నంబర్లలోని అసైన్డ్ భూమిని మాజీ మంత్రి నారాయణ బంధువులు, పరిచయస్తుల పేరుతో కొనుగోలు చేసినట్లు అభియోగం మోపారు. వీరందరిపైనా మంగళగిరిలోని సీఐడీ స్టేషన్‌లో ఐపీసీలోని వివిధ సెక్షన్లు, అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 13(1) కింద అభియోగాలు మోపినట్టు సీఐడీ తెలిపింది. ఈ కేసుకు సంబంధించి కొల్లి శివరాం, గట్టెం వెంకటేష్, చిక్కాల విజయసారథి, బడే ఆంజనేయులు, కొట్టి దొరబాబును సీఐడీ అధికారులు అరెస్ట్ చేశారు.
Read Also:ఆసియా కప్-2022లో అత్యధిక పరుగులు, వికెట్లు తీసిన ఆటగాళ్ల జాబితా
మరోవైపు ఏపీలో ఇసుక తవ్వకాల కాంట్రాక్టు ఆరోపణలపై JPVL సంస్థ వివరణ ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎంఎంటిసి నిర్వహించిన టెండర్లలో తమ సంస్థ ఏపీలో ఇసుక ఆపరేషన్స్ నిర్వహణను దక్కించుకుందని జేపీవీఎల్ మేనేజింగ్ డైరెక్టర్ పంకజ్ కౌర్ వెల్లడించారు. టెండర్లలో మిగిలిన సంస్థలతో పోటీ పడుతూ జెపివిఎల్ సాంకేతికం, ఆర్థికంగా తన సామర్థ్యాన్ని చాటుకుని ఈ టెండర్లలో కాంట్రాక్టును పొందిందన్నారు. టెండర్ నిబంధనల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్ధేశించిన అన్ని నిబంధనలను జెపివిఎల్ సంస్థ పాటిస్తోందని స్పష్టం చేశారు. జెపివిఎల్ సంస్థ విద్యుత్, కోల్ మైనింగ్ రంగాల్లో వ్యాపార అనుభవం కలిగిన సంస్థ అని.. జేపివిఎల్‌కు ఎటువంటి రాజకీయ పార్టీలతోనూ సంబంధాలు లేవన్నారు. కొందరు తమ స్వార్థ ప్రయోజనాల కోసం ఉద్దేశ పూర్వకంగా తమ సంస్థపై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఇటువంటి అసత్య ప్రచారాలను తమ సంస్థ తీవ్రంగా ఖండిస్తోందన్నారు.