సీనియర్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. మళ్లీ ఆయన్ను సర్వీస్‌లోకి తీసుకోవాలని ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్‌పీని తోసిపుచ్చింది సుప్రీం.. అయితే, హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఈ పరిణామంతో ఏబీ వెంకటేశ్వరరావుకు ఊరట లభించగా.. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మీడియాతో మాట్లాడిన ఏబీ వెంకటేశ్వరరావు.. సీరియస్‌గా స్పందించారు. ఏపీ ప్రభుత్వ స్పెషల్ లీవ్ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టేసిందని.. ఆంద్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సమర్ధించిందన్న ఆయన.. ఫిబ్రవరి 8 రెండో శనివారం అర్ధరాత్రి నన్ను సస్పెండ్ చేశారు.. నాపై ఎన్నో ఆబండాలు వేశారు.. ఆ సమయంలో ఒక పత్రికా ప్రకటన చేశారని మండిపడ్డారు. అయితే, ఈ చర్యను న్యాయపరంగా ఉన్న అవకాశాలు పరిశీలిస్తా అని చెప్పాను.. చట్ట ప్రకారమే నడుచుకున్నా, సుప్రీంకోర్టు కూడా ధృవీకరించిందన్నారు.. ఇదంతా ఎందుకు జరిగింది..? ఏ బావ కళ్లలో, సైకో కళ్లలో ఆనందం కోసం ఇలా చేశారు.. సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఓడింది..? అని నిలదీశారు ఏబీ వెంకటేశ్వరరావు.
Read Also: Byreddy Siddharth Reddy: నారా లోకేష్‌తో భేటీపై స్పందించిన బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
సుప్రీం కోర్టులో న్యాయవాదుల బృందాన్ని నియమించుకున్నారు.. నాకు కోర్టుల కోసం ఖర్చు అయ్యిందన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.. రాష్ట్రప్రభుత్వం పెట్టిన ఖర్చుకు సమానంగా నాకు డబ్బులు చెల్లించాలని కోరిన ఆయన.. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించిన వాళ్ల సాక్ష్యాలను ప్రభుత్వానికి ఇచ్చామన్నారు. అసలు కొనుగోలు జరగని దాంట్లో అవినీతి జరిగిందట… ఆలోచించరా..? వృత్తి నైపుణ్యం లేదా..? అని ఎద్దేవా చేశారు. ఈ ఖర్చుకు కారకులు ఎవరు..? అని నిలదీశారు. ప్రజలు కట్టిన పన్నులు.. దొంగ కేసులు వేసి డబ్బులు ఖర్చు పెట్టారని విమర్శించారు.. ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టించి చెడ్డపేరు తెచ్చారని.. చట్టవిరుద్ధమయిన నిర్ణయాలు తీసుకున్నవాళ్లను శిక్షించాలని కోరారు.. అంతేకాదు, ఇప్పటివరకు అయిన ఖర్చుకు సంబంధించిన డబ్బులు వాళ్ల నుంచి రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఇక, అధికారులు వస్తారు పోతారు.. ప్రజలు శాశ్వతం.. నేను లోకల్, ఎవ్వడిని వదిలి పెట్టను అని హెచ్చరించారు ఏబీ వెంకటేశ్వరరావు..