24 Lakhs Fraud In Krishna District Society Bank: కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలోని సిరివాడ గ్రామ సొసైటీ బ్యాంక్‌లో నిధుల గోల్‌మాల్ జరిగింది. శ్రీ సీతారామయ్య ప్రైమరీ అగ్రికల్చరల్ కో-ఆపరేట్ క్రెడిట్ సొసైటీ బ్యాంక్‌లో బాధితులు డిపాజిట్ చేసిన రూ. 24 లక్షలు మాయం అయ్యాయి. 2019 సంవత్సరంలో అత్కురి రామ కోటయ్య, అత్కురి పుల్లమ్మ, వీరి కుమారుడు అత్కురి ముక్తశ్వరావు.. తమ పేర్ల మీద రూ. 24 ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. సొసైటీ సిబ్బంది చేతివాటం వల్ల.. తమ ప్రమేయం లేకుండా తాము దాచుకున్న డబ్బుల్ని డ్రా చేశారని, డబ్బులు ఎలా మాయం అయ్యాయని అడిగితే తమకు సంబంధం లేదంటూ బ్యాంక్ సిబ్బంది చేతులెత్తేసిందని బాధితులు పేర్కొంటున్నారు.
తమ తండ్రి చనిపోయిన తర్వాత బ్యాంక్‌కి వెళ్లి ఫిక్స్‌డ్ డిపాజిట్ గురించి అడిగామని, అప్పుడే గోల్‌మాల్ జరిగిందన్న విషయం వెలుగులోకి వచ్చిందని అన్నారు. డబ్బులు ఏమయ్యాయని ప్రశ్నిస్తే.. బ్యాంక్ సిబ్బంది తమ పట్ల దురుసుగా ప్రవర్తించిందని బాధితులు సమాధానం ఇచ్చారు. తమ వద్ద ఒరిజినల్ బాండ్ కాగితాలు ఉన్నాయని చెప్పారు. అయితే.. బాండ్ కాగితం పోయిందని చెప్పి, పేపర్ యాడ్ ఇచ్చి, బ్యాంక్ సిబ్బంది కలిసి డబ్బులు డ్రా చేశారని బాధితులు అంటున్నారు. ఇప్పుడు బ్యాంక్‌కి వెళ్లి తమ డబ్బులు ఇవ్వమని అడుగుతుంటే.. మీకేం సంబంధం? అసలెందుకు వచ్చారు? అంటూ బ్యాంక్ సిబ్బంది వారు దురుసుగా ప్రవర్తించారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ.. వీరవల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి, పోలీసులు దర్యాప్తు చేపట్టారు.