ఏపీలో మరోసారి మినీపోరుకు రంగం సిద్ధమైంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక వరుస ఎన్నికల్లో వైసీపీనే ఏకపక్ష విజయాలు సాధిస్తూ వెళుతోంది. పంచాయతీ, కార్పొరేషన్, మున్సిపాలిటీ తదితర ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జెట్ స్పీడుతో వీచింది. ప్రతిపక్ష పార్టీలు వైసీపీకి కనీసం పోటీ ఇవ్వలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. వందకు దాదాపు 80నుంచి 90శాతం స్థానాల్లో వైసీపీ ఖాతాలోకే వెళ్లడం విశేషం. అయితే అనివార్య కారణాలతో దాదాపు 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు వాయిదాపడ్డాయి. వీటికి త్వరలోనే ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ రెడీ అవుతుండటం ఆసక్తిని రేపుతోంది.
ఇటీవల వెల్లడైన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఫలితాల్లోనూ వైసీపీనే అత్యధిక స్థానాలు సాధించి సత్తాచాటింది. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీలు వైసీపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేక చతికిలపడ్డాయి. ఒకటి అరచోట్ల మాత్రం టీడీపీ, జనసేన పార్టీలు కొద్దిగా పోటీ ఇచ్చినట్లు కన్పించింది. ఓవరాల్ గా చూసినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీనే ఏకపక్ష విజయాలను నమోదు చేసింది. అయితే అనివార్య కారణాలతో వాయిదాపడిన 12మున్సిపాలిటీలకు త్వరలోనే ఎన్నికలను నిర్వహించేందుకు ఈసీ రెడీ అవుతోంది. ఈనెల 19న ఎన్నికలకు సంబంధించిన ముసాయిదా విడుదల చేయాలని ఈసీ ఇప్పటికే కలెక్టర్ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
వార్డుల విభజన, ఓటర్ల నమోదు, రిజర్వేషన్లు సక్రమంగా జరుగలేదనే కారణాలతో గతంలో కొన్ని మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగలేదు. ఈక్రమంలోనే ఈ వివాదాలు పరిష్కారం అయ్యేలా ఎన్నికల అధికారులు స్థానిక రాజకీయ నాయకులతో సమావేశం అయ్యేందుకు నిర్ణయించారు. వీరి సలహాలు, సూచనలు తీసుకొని ఎన్నికల డేట్ ను ఈసీ ప్రకటించనుంది. అన్ని అంశాలను పరిగణలోకి ఈనెల 23న ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదల చేయనున్నారని సమాచారం. వీటిల్లో నెల్లూరు కార్పొరేషన్.. బుచ్చిరెడ్డిపాలెం.. ఆకీవీడు.. జగ్గయ్యపేట.. దాచేపల్లి.. దర్శి.. కొండపల్లి.. గురజాల.. బేతంచెర్ల.. కమలాపురం.. కుప్పం.. రాజంపేట.. పెనుగొండ మున్సిపాలిటీలు ఉన్నాయి.
వీటితోపాటుగా మరో 20మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో చనిపోయిన కౌన్సిలర్లు, కార్పొరేటర్ల స్థానాలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ కసరత్తులు చేస్తోంది. ఏపీలో మొత్తంగా 13 జిల్లాలు ఉండగా తొమ్మిది జిల్లాల పరిధిలో ఈ ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ఈ ఎన్నికలు మినీ పోరును తలపించడం ఖాయంగా కన్పిస్తోంది. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కడ ఎలాంటి ఎన్నిక జరిగిన ఆపార్టీనే విజయాలు సాధిస్తూ వెళుతోంది. కాగా త్వరలో జరుగబోయే మినిపోరులోనైనా ప్రతిపక్ష పార్టీలు వైసీపీ దూకుడును అడ్డుకుంటాయో లేదో వేచిచూడాల్సిందే..!