సీపీఐ యువనేత కన్నయ్య కుమార్ ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారు. ప్రఖ్యాత జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థి సంఘం మాజీ అధ్యక్షుడు. యూత్‌లో మంచి పాపులారిటీ కలిగిన నేత. ఈ జనరేషన్‌ని బాగా ఆకుట్టుకునే వక్త. ముఖ్యంగా మోడీ ప్రభుత్వాన్ని ప్రశ్నించటంలో దిట్ట. ప్రస్తుతం కాంగ్రెస్‌లో మోడీకి ధీటైన వక్త లేరు. రాహుల్ గాంధీ ప్రసంగాలు జనాన్ని ఉర్రూతలూగించలేవు. ప్రియాంకా గాంధీ కూడా ఫుల్ టైం పొలిటీషియన్ కాదు. ఈ నేపథ్యంలో కన్నయ్య కుమార్ లాంటి పవర్ ఫుల్ స్పీకర్ పార్టీలో చేరటం ఖచ్చితంగా హస్తం పార్టీకి ఫెచ్చింగే.
ఇటీవల కొంత కాలంగా కాంగ్రెస్‌లో అనూహ్య పరిణామాలు సంభవిస్తున్నాయి. వీటిని పరిశీలిస్తే ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ ఆపరేషన్ 2024 ప్రారంభించాడా అని కూడా అనిపిస్తుంది. కాంగ్రెస్‌లోకి కన్నయ్య రాక కూడా అలాంటి ఒక పరిణామమే. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్‌లో కొత్త రక్తం నింపేందుకు రాహుల్ గాంధీ చేస్తున్న ఒక ప్రయత్నం. కన్నయ్యతో పాటు గుజరాత్‌కు చెందిన దళిత నేత ఎమ్మెల్యే జిగ్నేష్ మేవానీ కూడా త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉంది. ఇక మరో యువనేత హార్దిక్ పటేల్ ఇప్పటికే గుజరాత్ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. ఈ ముగ్గురు యువనేతలు 2024 ఎన్నికల్లో యువ ఓటర్లను, దళిత బహుజన ఓటర్లను విశేషంగా ఆకట్టుకోగలరని కాంగ్రెస్ భావించి ఉండవచ్చు.
మరోవైపు, ఎన్నికల వ్యూహాలలో ఆరితేరిన అపర చాణక్యుడు ప్రశాంత్ కిశోర్ కూడా త్వరలో కాంగ్రెస్‌లో చేరతారన్న వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి కన్నయ్య కుమార్ కాంగ్రెస్ ఎంట్రీ వెనక ప్రశాంత్ కిశోర్ వ్యూహం ఉండవచ్చని రాజకీయ పరిశీలకులు అనుమానిస్తున్నారు. పైగా ప్రశాంత్ కిశోర్, కన్నయ్య కుమార్ ఇద్దరూ బీజేపీకి చెందిన వారే. వీరి మొదటి టార్గెట్ బీహార్‌లో మళ్లీ కాంగ్రెస్‌కు జీవం పోయటం. లాలూ, నితీష్ హయాంలలో కాంగ్రెస్ పరిస్థితి అంతకంతకు దిగజారుతూ వస్తోంది. గత బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీ అధికారం దక్కకపోవటానికి కాంగ్రెస్ పార్టీయే కారణమన్న అపప్రద దాని మీద ఉంది. ఈ నేపథ్యంలో బీహార్‌లో కాంగ్రెస్‌కు మళ్లీ ఎంతో కొంత పూర్వ వైభవం తెచ్చే సత్తా కన్నయ్య కుమార్ లాంటి యువనేతలకే సాధ్యమని కాంగ్రెస్ నమ్ముతోంది.
2019 లోక్ సభ ఎన్నికల్లో సీపీఐ అభ్యర్థిగా బేగుసరాయ్ నుంచి పోటీచేసి ఓడిపోయారు కన్నయ్య కుమార్. ఆర్జేడీ అధినేత ఉద్దేశపూర్వకంగానే మహాఘటబంధన్‌కు కన్నయ్య కుమార్‌ని దూరంగా ఉంచారన్న వాదన కూడా ఉంది. కన్నయ్య కుమార్ లాంటి ప్రజాకర్షణ కలిగిన వక్త కూటమిలో ఉంటే తన కుమారుడు తేజస్వీ యాదవ్ రాజకీయ భవిష్యత్ ప్రమాదంలో పడుతుందని లాలూ భయపడ్డాడని ఒక టాక్. దాని ఫలితంగా ఆర్జేడీ అలయన్స్‌లో సీపీఐ లేదన్న వాదన ఉంది. అయితే గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కనయ్యకుమార్ పోటీ చేయలేదు. కానీ ఆర్జేడీ తరపున విస్తృతంగా ప్రచారం నిర్వహించారు.
ఇప్పుడు కన్నయ్య కుమార్ కాంగ్రెస్ నాయకుడు. ఆటోమేటిక్‌గా ఆయన బీహార్ ప్రతిపక్ష కూటమి నాయకుడు అవుతాడు. మరి ఇప్పుడు బీహార్ ప్రతిపక్ష నేత తేజశ్వి ఏమంటాడు? ప్రస్తుతం బీహార్ మహాఘట్బంధన్‌లో తేజస్వీ యాదవ్ తిరుగులేని నాయకుడు. ఇక ముందు కూడా ఆయనే ఉంటాడు. మరి రాబోయే రోజుల్లో తేజస్వితో కన్నయ్య కలిసి పనిచేస్తాడా అన్నది ప్రశ్న. ఏదేమైనా ..ఎవరేమన్నా ఆయన సిపిఐ నుంచి కాంగ్రెస్‌కి మారడం ఆర్‌జెడికి కొంత ఆందోళన కలిగిస్తొందన్నది మాత్రం వాస్తవం. తమను సంప్రదించకుండా ఆయనను పార్టీలోకి తీసుకోవటం పట్ల ఆ పార్టీ అసంతృప్తితో ఉంది. దానినే ఆ పార్టీ నేతలు తమ మాటల ద్వారా వ్యక్తపరుస్తున్నారు. కన్నయ్య కుమార్ ఎవరో తమకు తెలియదు..ఏ కన్నయ్య కుమార్..ఎక్కడ నుంచి వచ్చాడని అంటున్నారు ఆర్జేడీ నేతలు. తేజస్వీ యాదవ్, కన్నయ్య కుమార్ మధ్య పోలికే లేదని , కనీసం ఆయన దరిదాపులోకి కూడా రాలేరని తమ ఆందోళనను కప్పిపుచ్చుకుంటున్నారని అర్థమవుతోంది. వాస్తవానికి వీరు అనే మాటలలో కూడా వాస్తవం ఉంది. నిరుడు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్జేడీని విజయవంతంగా నడపించారు. దాదాపు అధికారం అందుకునే వరకు వెళ్లారు. ఆయన సారధ్యంలోనే బీహార్ అసెంబ్లీలో అతి పెద్ద పార్టీగా ఆర్జేడీ అవతరించింది. మొత్తానికి తేజస్వీ తన సత్తా ఏమిటో నిరూపించుకున్నారు.
ఇక కన్నయ్య కుమార్ కాంగ్రెస్‌లో చేరటం బీజేపీకి కూడా మింగుడు పడటంలేదు. దాంతో ఆయన హస్తం కండువా కప్పుకున్న మరుక్షణం నుంచే మాటల తూటాలు పేల్చటం మొదలు పెట్టింది. బీహార్ రాజకీయాల్లో కనయ్య కుమార్‌కు ఎలాంటి స్థానం లేదని ..మునిగిపోయే నావ లాంటి కాంగ్రెస్‌లో చేరితే అతడూ మునిగిపోతాడంటోంది. మరోవైపు జేడీయూ కూడా కన్నయ్య కాంగ్రెస్‌లో చేరటాన్ని పెద్ద సీరియస్‌గా తీసుకోవట్లేదు. నాయకుడు లేని కాంగ్రెస్ పార్టీలోకి ఎవరు వస్తే ఏంటి..ఎవరు పోతే ఏమిటని లైట్ తీసుకుంటున్నారు ఆ పార్టీ నాయకులు.
ఎవరు ఏమన్నా కాంగ్రెస్ ఇప్పుడు కన్నయ్య ద్వారా బీహార్‌లో తన ఉనికి కోసం ప్రయత్నిస్తుందనటంలో ఏమాత్రం సందేహం లేదు. మొదట మహాఘట్బంధన్‌లో తామ స్థానాన్ని నిలబెట్టుకునేందుకు ప్రయత్నించవచ్చు. ఈ క్రమంలో ఆర్జేడీ-కాంగ్రెస్ మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశమూ ఉంది. ఈ నేపథ్యంలో కన్నయ్య కుమార్ తేజశ్వి యాదవ్ నాయకత్వంలో పని చేస్తారా ..? లేదంటే రాబోవు రోజుల్లో అతనికి సవాలుగా మారతాడా అన్నది చూడాల్సివుంది.