పంజాబ్ రాజకీయం మారుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ఎక్కువ సమయం లేదు. అందుకే ప్రధాన పార్టీలు వ్యూహ రచనలు మొదలు పెట్టాయి. అధికార కాంగ్రెస్ మరోసారి పంజాబ్ పీఠమెక్కాలని ప్లానింగ్‌లో ఉంది. కెప్టెన్ అమరిందర్ సింగ్ స్థానంలో చరణ్‌జీత్ సింగ్ చన్నీకి సిఎం పదవి కట్టబెట్టటం అందులో భాగమే. అయితే ఇది కాంగ్రెస్‌లో ఇంటిపోరు భగ్గుమంది.
పీసీసీ చీఫ్ సిద్ధూ లీడర్‌షిప్‌లోనే కాంగ్రెస్ ఎన్నికలకు వెళ్తుందని పార్టీ సీనియర్ నేత హరీశ్ రావత్ చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఆ వ్యాఖ్యలను పంజాబ్ పీసీసీ మాజీ చీఫ్ సునిల్ జాకర్ తప్పుబట్టారు. మరోవైపు, కొత్త ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి అమరీందర్ సింగ్‌కు డుమ్మా. దాంతో ఫ్యూచ్ ప్లాన్ ఏమిటని పరిశీలకులు ఆసక్తిగా గమనిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంత కుంపటి పెడతారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదిలావుటే, పంజాబ్‌లో కాంగ్రెస్, బజేపీ యేతర ప్రత్యామ్నాయంగా ఆమ్‌ఆద్మీ పార్టీ ఆవిర్భవిస్తోంది. కాంగ్రెస్, శిరోమణి ఆకాలీదళ్ పాటు ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రధాన రాజకీయ శక్తిగా అవతరించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో 16 సీట్లు గెలిచి సత్తా చాటింది. శిరోమణి ఆకాళీదల్ కంటే రెండు సీట్లు ఎక్కువే గెలవగలిగింది. 117 స్థానాలున్న అసెంబ్లీలో ఇవి ఓ స్థాయి ఫలితాలు అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఢిల్లీ తర్వాత పంజాబ్‌లో మాత్రమే ఆప్‌కు అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. మొదట హర్యానాలో అధికారం చేజిక్కుంచుకోవాలని ప్రయత్నించింది..కానీ సాధించలేకపోయింది.
వచ్చే ఉత్తరాఖండ్ ,యూపీ, గుజరాత్ ఎన్నికల్లో సత్తా చూపాలని ఆప్ బావిస్తోంది. సూరత్ మున్సిపల్ ఎన్నికల్లో 120 స్థానాలకు గాను 27 చోట్ల ఆప్ విజయం సాధించి ఆశ్చర్య పరిచింది. పటిదార్ సామాజిక వర్గం బలంగా ఉన్న అన్ని చోట్ల ఆప్ విజయం సాధించటం విశేషం. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌కు ఇది బూస్ట్ అనటంలో ఎలాంటి సందేహం లేదు. దేశ వ్యాప్తంగా కంగ్రెస్ బలహీనమవుతున్న వేళ బీజేపీకి మరో ప్రత్యామ్నాయంగా ఆప్ కనిపిస్తోంది.
మెల్ల మెల్లగా బీజేపీ, కాంగ్రెస్ వ్యతిరేక శక్తులకు ఆమ్‌ఆద్మీ పార్టీ ఓ ఫ్లాట్‌ఫామ్‌గా మారుతోంది. కేంద్రం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా శిరోమణి అకాళీదల్ ఎన్‌డీఏ నుంచి బయటకు వచ్చింది. కానీ చాలా కాలంగా బీజేపీతో ఆ పార్టీకి గల అనుబంధం నేపథ్యంలో పంజాబ్ రైతాంగం దానిని నమ్మే పరిస్థితిలో లేదు. బీజేపీ, ఆకాలీదళ్ రెండే వేర్వేరు కాదు ..ఒక్కటే అని ఆమ్‌ఆద్మీ పార్టీ ప్రచారం చేస్తోంది. ఇదే సమయంలో కాంగ్రెస్‌ను కూడా టార్గెట్ చేస్తోంది. తమకు భయపడి సీఎంని మార్చిందన్న భావనను ప్రజల్లోకి తీసుకుపోతోంది.
ఢిల్లీ తరహా వ్యూహంతో పంజాబ్‌ని కైవసం చేసుకోవాలని ఆమ్ ఆద్మీ పావులు కదుపుతోంది. ముఖ్యంగా కొత్త విద్యుత్ చట్టంపై రైతుల పోరాటాన్ని తనకు అనుకూలంగా మలచుకుంటోంది. ఢిల్లీలో విజయవంతం అయిన విద్యుత్తు ఫార్మూలాను 2017లో పంజాబ్ ఎన్నికల్లో ప్రయోగించి అత్యధిక స్థానాలు పొందిన రెండో పార్టీగా ఆప్ నిలిచింది. ఈ సారి ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ల్లోనూ తమదైన ముద్ర వేయాలని ఏడాది నుంచే పార్టీ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ ఎన్నికల ప్రణాళికలు సిద్ధం చేశారు.
పంజాబ్‌లో సిక్కులు మెజార్టీ అయినప్పటికీ హిందూ జనాభా కూడా ఎక్కువే. హిందూ ఓటర్లలో ఆమ్ ఆద్మీపై నమ్మకం పెరుగుతోంది. అలాగే సిక్కులలో కూడా కేజ్రీవాల్‌కు గణనీయమైన పలుకుబడి కనిపిస్తోంది. గతంలో ఆ వర్గం ఓట్లు గంపగుత్తగా శిరోమనీ అకాలీదళ్‌కు, హిందూ ఓటర్లను బీజేపీ ఆకట్టుకునేది. బీజేపీ రాకముందు అవి కాంగ్రెస్ ఖాతాలో పడేవి. బీజేపీ రాకతో కాంగ్రెస్ కొంత ఇబ్బంది పడింది. అయితే కెప్టెన్ అమరీందర్ సింగ్ తన వ్యక్తిగత పేరు ప్రతిష్టలతో హిందూ ఓటర్లను ఆకట్టుకుంటూ వచ్చారు. ఇందిర హయాంలో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్‌ని తీవ్రంగా వ్యతిరేకించారాయన. ఆయన పట్ల సిక్కులలో గౌరవం వుంది. అయితే ఇప్పుడు ఆయన సీఎం పదవి నుంచి వైదొలిగారు. మరి పార్టీలో కొనసాగుతారో లేదో తెలియదు. సొంత పార్టీ పెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదే జరిగితే రేపటి అసెంబ్లీ ఎన్నికల్లో ఐదు పార్టీలు బరిలోకి దిగుతాయి. ఇప్పటికే కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ, శిరోమణీ ఆకాలీదళ్, బీజేపీ వేరు వేరుగా బరిలో దిగటం ఖాయం. మరి ఎవరికి అధికారం దక్కుతుందో తెలియదు. హంగ్ ఏర్పడినా ఆశ్చర్యం లేదు. ఐతే దీనిపై ఇప్పుడే మాట్లాడటం తొందరపాటవుతుంది. క్లారిటీ రావాలంటే మరి కొన్ని నెలలు వేచి చూడాల్సిందే!