స్వదేశంలో కన్నా విదేశాల్లో విజయం చాలా స్వీట్. ఎప్పుడోగానీ అలాంటి విక్టరీలు దక్కవు. ఓవల్ టెస్ట్ విన్ కూడా అలాంటిదే. స్వీట్ స్వీట్ విక్టరీ. ఇంగ్లండ్‌పై వరసగా రెండో టెస్టులో విజయం సాధించి క్రికెట్ ఫ్యాన్స్‌ను పండగ చేసుకోమంది కోహ్లీసేన. నిజమే..అభిమానులకు.. ముఖ్యంగా టెస్ట్ క్రికెట్ ఫ్యాన్స్ సెలబ్రేట్ చేసుకోవాల్సిన విజయంఇది. ఈ గెలుపుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇంగ్లండ్‌లో ఇంగ్లండ్‌ను వరసగా రెండు టెస్టుల్లో ఓడించటం చరిత్రలో రెండు సార్లే జరిగింది. మొదటిసారి 1986లో .. కపిల్ డెవిల్స్ ఆ ఘనత సాధించారు. అంటే 34 ఏళ్ల తరువాత మళ్లీ ఇప్పుడే. ఇలాంటి సందర్బం వచ్చినప్పుడు ఆ పాత జ్ఞాపకాలను తలచుకుంటే మరింత ఆనందంగా ఉంటుంది.
1986 ఇంగ్లండ్ టూర్‌లో కపిల్ సేన టెస్ట్ ఇంగ్లిష్ టీమ్‌ని మట్టి కరిపించింది. ఇప్పుడు కోహ్లీసేన తలపడుతున్నది ఐదు టెస్టుల సిరీస్. 1986 సిరీస్‌లో మూడే టెస్టు మ్యాచ్‌లు. మొదటి టెస్టులో ఇంగ్లిష్ టీమ్ కెప్టెన్ డేవిడ్ గోవర్..కాగా రెండు మూడు టెస్టులకు మైక్ గ్యాటింగ్ కెప్టెన్సీ చేశారు. నాటి సిరీస్‌లో ఇంగ్లండ్ టీమ్‌లో గ్రాహం గూచ్, అలన్ లాంబ్, డేవిడ్ గోవర్, మైక్ గ్యాటింగ్ వంటి లెజెండ్స్ ఉన్నారు. ఆల్‌రౌండ్ గ్రేట్ ఇయాన్ బోథమ్ ఆ సిరీస్‌లో ఆడలేదు. డిసిప్లినరీ యాక్షన్ కింద అతనిపై కొన్ని నెలల పాటు నిషేదం విధించటంతో ఈ సిరీస్‌కు దూరమయ్యాడు.
అప్పటి టీమ్ ఇండియాలో కపిల్ దేవ్ సునీల్ గవాస్కర్ , శ్రీకాంత్, అజారుద్దీన్, దిలీప్ వెంగ్‌సర్కార్ , మొహిందర్ అమరనాథ్, రోజర్‌బిన్నీ,రవిశాస్ర్తి, మణీందర్ సింగ్ వంటి హేమాహేమీలున్నారు. లార్డ్స్ లో జరిగిన తొలిటెస్ట్‌లో భారత్ ఐదు వికెట్ల తేడాతో గెలిచింది. దిలీప్ వెంగ్‌సర్కార్ సెంచరీ చేశాడు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ టాప్ ఆర్డర్‌ని కుప్పకూల్చి విజయంలో కీలక పాత్రపోషించిన కపిల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. కెప్టెన్‌గా కపిల్‌కు 21 మ్యాచ్‌ల తర్వాత దక్కిన విజయం ఇది. ఇక లీడ్స్‌లో జరిగిన సెకండ్ టెస్ట్‌లో 279 పరుగుల భారీ తేడాతో గెలిచింది. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీ , సెకండ్ ఇన్నింగ్స్‌లో సెంచరీ సాధించిన దిలీప్ వెంగసర్కార్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. ఇక మూడో టెస్ట్ డ్రాగా ముగిసింది. మైక్ గ్యాటింగ్, దిలీప్ వెంగసర్కార్ జాయింట్‌గా ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు అందుకున్నారు.
క్రికెట్ మక్కా .. లార్డ్స్, అలాగే నూటా పాతిక సంవత్సరాల పురాతన ఓవల్ గ్రౌండ్‌లో ఒకే సిరీస్‌లో విజయం సాధించటం ఇదే ఫస్ట్. మరో ప్రత్యేకత ఏమిటంటే ఓవల్‌లో టెస్ట్ మ్యాచ్ గెలవటం గత యాబై ఏళ్లలో ఇదే తొలిసారి. 1971 సిరీస్‌లో మొదటిసారి ఓవల్‌లో గెలవటంతో పాటు సిరీస్ కూడా కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు టీమ్ ఇండిమా మూడు సందర్భాల్లో మాత్రమే ఇంగ్లండ్‌లో టెస్ట్ సిరీస్ సాధించింది భారత్.
ఇంగ్లండ్‌లో భారత్ 1971, 1986,2007 సిరీస్‌లు గెలిచింది. ఇప్పుడు గెలిస్తే నాలుగవది అవుతుంది. ఓవల్ విజయంతో క్యాప్టెన్ గా కోహ్లీ టెస్ట్ రికార్డు మరింత బెటర్ అయింది. 65 టెస్టులకు సారధ్యం వహించి 38 మ్యాచ్‌లలో గెలిపించాడు. 16 మ్యాచ్ లు ఓడిపోయింది. 11 మ్యాచ్లు డ్రా అయ్యాయి. ఇంగ్లండ్‌లో అత్యధిక మ్యాచ్‌లు గెలిపించిన కెప్టెన్ గా కూడా కోహ్లీ ఘనత సాధించారు. ఓవల్ విజయం సారధిగా ఇంగ్లండ్‌లో ఆయనకు మూడవ విజయం. చెప్పుకుంటూ పోతే ఓవల్ గెలుపులో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. చివరి టెస్ట్ ఈ నెల 10 నుంచి 14 వరకు ఓల్డ్ ట్రాఫర్డ్‌లో జరుగుతుంది. ఈ మ్యాచ్లో గెలిచినా ..డ్రా చేసినా సిరీస్ మన సొంతమవుతుంది. ఇంగ్లండ్‌కు డూ ఆర్ డై గా మారిన ఈ టెస్ట్‌లో టీమిండియాను ఎలా అడ్డుకుంటుందో చూద్దాం.. చివరి టెస్ట్ మరింత రసవత్తరంగా సాగటం ఖాయం!!