ఉమ్మడి ఆంధప్రదేశ్ విభజనతో నవ్యాంధ్ర భారీగా నష్టపోయిందని ఏపీవాసులు ఇప్పటికీ మథనపడుతున్నారు. ఈ కారణంగానే ఏపీలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను వరుస ఎన్నికల్లో చిత్తుచిత్తుగా ఓడిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ పరిస్థితి అయితే ఇప్పట్లో కోలుకునే అవకాశం లేదని తెలుస్తోంది. బీజేపీ కేంద్రంలో అధికారంలోకి ఉండటంతో ఏపీలో ఆపార్టీ పర్వాలేదనిపిస్తోంది. ఇక నవ్యాంధ్రలో తొలిసారి టీడీపీ అధికారంలోకి వచ్చింది. ఐదేళ్లు అధికారంలో ఉన్న ఆపార్టీ సంక్షేమ కార్యక్రమాల కంటే అభివృద్ధిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది. అయితే ఈ ఐదేళ్లలో ఏపీకి కనీసం రాజధానిని కూడా నిర్మించలేకపోయిందని విమర్శలను ఎదుర్కొంటోంది.
ఏపీకి అమరావతి కొత్త రాజధానిగా ఉంటుందని టీడీపీ ప్రకటించింది. అయితే ఆమేరకు టీడీపీ అక్కడ పనులను చేయలేక పోయింది. పూర్తి స్థాయిలో రాజధానిని నిర్మించకపోవడంతో టీడీపీ గత ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. దీనికితోడు అభివృద్ధిని మొత్తం అమరావతికే పరిమితం చేశారనే విమర్శలను చంద్రబాబు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇది టీడీపీకి మైనస్ గా మారింది. టీడీపీ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చింది. ఏపీలోని మూడు ప్రాంతాలను అభివృద్ధి చేసేలా సీఎం జగన్మోహన్ రెడ్డి త్రీ క్యాపిటల్ విధానాన్ని తీసుకొచ్చారు.
మూడు రాజధానుల కాన్సెప్ట్ వినడానికి బాగానే ఉన్నా క్షేత్రస్థాయిలో పరిస్థితులు వేరేలా కన్పిస్తున్నాయనే టాక్ విన్పిస్తోంది. మూడు ప్రాంతాల్లో అభివృద్ధి జరుగకపోగా ప్రాంతీయ విబేధాలకు కారణం అవుతుందనే విమర్శలు వస్తున్నాయి. ఇదే సమయంలో టీడీపీ మాస్టర్ ప్లాన్ తో ముందుకెళుతోంది. టీడీపీని దెబ్బకొట్టేలా వైసీపీ తెరపైకి తీసుకొచ్చిన మూడు రాజధానుల కాన్సెప్ట్ ఇప్పుడు అదే పార్టీపై చంద్రబాబు ప్రయోగిస్తున్నారు. దీంతో ఏపీలో ప్రాంతాల వారీగా కొత్త ఉద్యమాలు పుట్టుకొస్తున్నాయి.
గత కొంతకాలంగా సైలంటైన టీడీపీ తిరిగి యాక్టివ్ అవుతోంది. దీనిలో భాగంగానే వైసీపీని టార్గెట్ చేసేలా వ్యూహాలు రచిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన మూడు రాజధానుల అంశాన్ని టీడీపీ ఎప్పటికప్పుడు చెక్ పెడుతోంది. కోర్టుల్లో కేసులు వేస్తూ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు ప్రాంతాల వారీగా సమస్యలను లెవనెత్తూ ఆయా ప్రాంతాల్లో టీడీపీ బలపడేలా ప్లాన్ చేస్తోంది.ఉత్తరాంధ్ర, రాయలసీయ, కోస్తా ప్రాంతాల వారీగా టీడీపీ నేతలు ఉద్యమాలను చేస్తున్నారు.
చంద్రబాబు ప్లాన్ లో భాగంగానే ఆయా ప్రాంతాల్లో నేతలు స్థానిక సమస్యలపై పోరాటాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. తాను ఏ ప్రాంతానికి చెందినవాడని కాదని అందరివాడినని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే సమయంలో ప్రాంతీయంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా వైసీపీ ప్లాన్ ను ఆ పార్టీపైనే ప్రయోగిస్తూ చంద్రబాబు ప్రాంతీయ ఉద్యమాలకు తెరలేపుతున్నట్లు కన్పిస్తోంది. అయితే ఈ వ్యవహారం మొత్తం రాబోయే రోజుల్లో ఏపీకి నష్టం కలిగించే అవకాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.