సినీనటుడు, జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్ దూకుడు పెంచుతున్నారు. సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ మూవీతో హిట్ అందుకున్నారు. ఇదే సమయంలో వరుసగా నాలుగైదు సినిమాలకు కమిటై ఫుల్ బీజీగా మారిపోయాడు. దీంతో ఆయన రాజకీయంగా కొంత సైలంట్ అవుతారని అంతా భావించారు. కానీ ఊహించని విధంగా జనసేనాని రాజకీయంగానూ దూకుడు చూపిస్తుండటం చర్చనీయాంశంగా మారింది.
పవన్ కల్యాణ్ కు రాజకీయంగా చాలా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2014 ఎన్నికల ముందు జనసేన పార్టీ స్థాపించిన పవన్ కల్యాణ్ ఆ ఎన్నికల్లో పోటీ చేయలేదు. నాడు ఆయన టీడీపీ కూటమికి మద్దతు ఇచ్చారు. ఆ ఎన్నికల్లో టీడీపీ కూటమి విజయం సాధించింది. టీడీపీ ఐదేళ్లు అధికారంలోకి ఉన్నా జనసేనాని ఎలాంటి పదవి తీసుకోలేదు. టీడీపీ నేతలు పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శలు చేయడంతో ఇరుపార్టీల మధ్య విబేధాలు వచ్చాయి. దీంతో గత ఎన్నికల్లో టీడీపీ, జనసేన పార్టీలు వేర్వురుగా పోటీ చేశాయి.
అయితే ఆ ఎన్నికల్లో ఫ్యాన్ గాలి జోరుగా వీచింది. టీడీపీకి కేవలం 23సీట్లు రాగా, జనసేనకు కేవలం ఒకే ఒక్క సీటు వచ్చింది. పవన్ కల్యాణ్ స్వయంగా రెండు చోట్ల ఓటమి పాలవడం జనసైనికులను నిరుత్సాహానికి గురిచేసింది. ఆ ఎన్నికతో జనసేన పని అయిపోయిందని అంతా భావించారు. అయితే అనుహ్యంగా పవన్ కల్యాణ్ పోరాట పటిమ చూపిస్తున్నారు. దీంతో ప్రజలు సైతం జనసేన వైపు మెల్లిగా ఆకర్షితులు అవుతున్నారు.
కిందటి మున్సిపల్, ఎంపీటీసీ ఎన్నికల్లోనూ జనసేన చెప్పుకోదగిన స్థాయిలో రాణించింది. ఈ ఫలితాలు జనసేనకు మంచి బూస్ట్ ఇచ్చినట్లే కన్పిస్తోంది. ఈక్రమంలో జనసేనాని ప్రజలను ఆకట్టుకునేలా వరుస కార్యక్రమాలకు పిలుపునిస్తున్నారు. ఇటీవల రోడ్ల సమస్యలపై జనసైనికులు గళం ఎత్తగా ప్రజల నుంచి మంచి స్పందన వచ్చింది. అలాగే సినిమా ఇండస్ట్రీలోని సమస్యలపై పవన్ కల్యాణ్ ఓ సినిమా వేదికగా వైసీపీ సర్కారును టార్గెట్ చేశారు.
ఇదికాస్తా వివాదాస్పదంగా మారింది. జనసేన, వైసీపీ నేతలు ఒకరిపై విమర్శలు చేసుకోవడంతోపాటు దాడులు చేసుకునేదాకా పరిస్థితి వచ్చింది. ఇండస్ట్రీలోని వైసీపీ మద్దతుదారులు పవన్ కల్యాణ్ పై వ్యక్తిగతంగా విమర్శలకు దిగుతున్నారు. దీంతో కొద్దిరోజులుగా వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా సీన్ మారిపోయింది. ఇదే సమయంలో జనసేనాని నేడు రాజమండ్రిలో ఓ శ్రమదానానికి ఈరోజు రెడీ అయిపోయారు. ఈ సందర్భంగా ఆయన ఏం మాట్లాడుతారనేది ఆసక్తికరంగా మారింది.
మరోవైపు జనసేనాని క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత జనసేనలోని కీలక నేతలు ఇతర పార్టీల్లోకి జంప్ అయ్యారు. దీంతో గత ఏడేళ్లుగా పార్టీని నమ్ముకొని తన వెంట నడుస్తున్న వారికి కీలక పదవులు ఇవ్వాలని పవన్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. అదేవిధంగా పార్టీ బలంగా ఉన్న చోట్ల ముందుగానే ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారట. ఇలా చేయడం వల్ల పార్టీకి కొంచెం అడ్వాంటేజ్ గా ఉంటుందని జనసేనాని భావిస్తున్నారు.
ఇందులో భాగంగానే ముందుగా పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ప్రకాశం జిల్లాల్లో అభ్యర్థులను ప్రకటించేందుకు జనసేనాని సిద్ధమవుతున్నారు. జిల్లా, మండల, గ్రామ స్థాయిల్లో పార్టీని బలోపేతం చేసేలా కొన్ని కార్యక్రమాలను రూపొందిస్తున్నారు. బీజేపీతో సంబంధం లేకుండా జనసేన జెండాను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. త్వరలోనే జనసేనలోనూ పదవుల పందేరం షూరు కానుంది. మొత్తానికి జనసేనాని కొద్దిరోజులుగా రాజకీయంగానూ దూకుడు పెంచడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.