Huge Losses in Stock Market: దేశీయ స్టాక్ మార్కెట్‌లో రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్ పడింది. ఇవాళ గురువారం ఒకటీ అరా మెరుపులు తప్ప రోజంతా లాస్‌లోనే నడిచింది. మార్నింగ్ ఓ మోస్తరు నష్టాలతో ప్రారంభమై ఈవెనింగ్ భారీ నష్టాలతో ముగిసింది. అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లు పెంచటంతో ఆ ప్రభావం గ్లోబల్ మార్కెట్‌లపై తీవ్రంగా పడింది. సెన్సెక్స్ 878 పాయింట్లు కోల్పోయి 61,799 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది.
సెన్సెక్స్‌లో సఫైర్ ఫుడ్స్, మహింద్రా లైఫ్, నైకా తదితర అన్ని సంస్థలు భారీగా లాసయ్యాయి. ఎన్‌టీపీసీ, సన్ ఫార్మా మాత్రం కాస్త బెటర్‌గా ఉన్నాయి. నిఫ్టీ 247 పాయింట్లు లాసై 18,413 వద్ద ముగిసింది. నిఫ్టీ మిడ్‌క్యాప్ హండ్రెడ్ మరియు నిఫ్టీ స్మాల్‌క్యాప్ హండ్రెడ్ సున్నా పాయింట్ ఒక శాతం వరకు లాభం పొందాయి. రంగాల వారీగా పరిశీలిస్తే.. నిఫ్టీలో పబ్లిక్ సెక్టార్ బ్యాంకులు ఒక శాతానికి పైగా లాభపడ్డాయి.
read more: Nitish Kumar: తాగితే చస్తారు.. మద్యం మరణాలపై సీఎం నితీష్ ఘాటు వ్యాఖ్యలు
ఐటీ ఇండెక్స్ భారీగా దెబ్బతింది. ఒక శాతం కన్నా తక్కువకు దిగిచ్చింది. ఆయిల్ సంస్థలు సైతం నష్టాల బాట పట్టాయి. మార్కెట్ ఇవాళ ఇంత వీక్‌గా ఉన్నప్పటికీ ఫెర్టిలైజర్ షేర్లు రాణించటం విశేషం. ఎంఎఫ్‌ఎల్, ఎన్‌ఎఫ్‌ఎల్, ఆర్‌సీఎఫ్ స్టాక్స్ విలువ 18 శాతం వరకు పెరిగింది. వ్యక్తిగత స్టాక్స్ విషయానికొస్తే.. ఐఆర్‌సీటీసీ షేర్ వ్యాల్యూ 5 శాతానికి పైగా పడిపోయింది. ప్రభుత్వ వాటాను విక్రయించనున్నట్లు ప్రకటన వెలువడటంతో షేర్ విలువ నేల చూపులు చూసింది.
బిడ్లు దాఖలు చేసేందుకు విధించిన గడువును జనవరి 7వ తేదీకి పొడిగించటంతో ఐడీబీఐ బ్యాంక్ షేర్ల విలువ 6 శాతానికి పైగా ర్యాలీ తీసి 52 వారాల గరిష్టానికి(60.6కు) చేరింది. 10 గ్రాముల బంగారం ధర 647 రూపాయలు తగ్గి 54,027 రూపాయల వద్ద గరిష్టంగా ట్రేడ్ అయింది. కిలో వెండి రేటు ఏకంగా 1609 రూపాయలు తగ్గి 67,693 రూపాయల వద్దకు దిగొచ్చింది. రూపాయి విలువ 6 పైసలు కోల్పోయింది. ఫలితంగా.. డాలరుతో పోల్చితే మారకం విలువ 82 రూపాయల 61 పైసలుగా నమోదైంది.