బీజేపీ వరుసగా రెండుసార్లు కేంద్రంలో అధికారంలోకి వచ్చిందంటే అది కేవలం మోదీ ఇమేజ్ వల్లేనని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన గుజరాత్ కు వరుసగా నాలుగుసార్లు ముఖ్యమంత్రిగా చేశారు. బీజేపీకి గుజరాత్ ను కంచుకోటగా మార్చేశారు. ఇక కేంద్రంలో బీజేపీ అధికారంలోకి రావడంతో నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయ్యారు. నరేంద్ర మోదీ ప్రధానిగా ఉన్న గుజరాత్ పై తన మార్క్ ఎక్కడా మిస్ కాకుండా చూసుకుంటూ వస్తున్నారు. ఇక త్వరలోనే గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితుల రీత్య ఇక్కడ బీజేపీకి గెలుపు అనివార్యంగా మారింది. దీంతో ఈ ఎన్నికలు ప్రధాని మోదీకి సవాలుగా మారనున్నాయి.
2017లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి గట్టి పోటీ ఇచ్చింది. మొత్తం 182 స్థానాలుండగా బీజేపీ 99 సీట్లలో విజయం సాధించగా కాంగ్రెస్ 66 స్థానాలను దక్కించుకుంది. గతంలో కంటే కాంగ్రెస్ ఇక్కడ అనుహ్యంగా పుంజుకొని బీజేపీకి గట్టి షాకిచ్చింది. అయితే ఆ తర్వాత బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్ చేపట్టింది. కాంగ్రెస్ నేతలకు కండువాలు కప్పేసి కమలం పార్టీలో చేర్చుకుంది. ఇక ఇప్పుడు మరోసారి ఎన్నికలు సమీపిస్తుండటంతో కాంగ్రెస్ పార్టీ గుజరాత్ పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ యువనేత రాహుల్ గాంధీ రంగంలోకి దిగి ఎన్నికల వ్యూహాలను అమలు పరుస్తున్నారు.
గతంతో పోలిస్తే కాంగ్రెస్ కు ఇక్కడ అనుకూల పవనాలు వీస్తున్నాయి. దీంతో ఈసారి ఎలాగైనా గుజరాత్ పీఠం దక్కించుకోని బీజేపీకి సవాల్ విసరాలని రాహుల్ గాంధీ భావిస్తున్నారు. తద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపి లోక్ సభ ఎన్నికలకు సమాయత్తం కావాలని ఆపార్టీ భావిస్తోంది. ఇప్పటికే గుజరాత్ లో కాంగ్రెస్ ప్రచారం మొదలుపెట్టింది. కేంద్రం, రాష్ట్రంలో బీజేపీ అధికారంలో ఉన్నా.. గుజరాత్ కు చేసింది ఏమీలేదని కాంగ్రెస్ ప్రచారం షూరు చేసింది. ప్రత్యేక సభలు, సమావేశాలు పెడుతూ అన్నివర్గాల ప్రజలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ వ్యూహరచనలు చేస్తుంది.
బీజేపీ అనుకూలంగా ఉండే పటీదార్లు(పటేల్ సామాజికవర్గం) ఈసారి కాంగ్రెస్ వైపు చూస్తున్నారని సమాచారం. పటీదార్ల నుంచి హార్థిక్ పటేల్ కాంగ్రెస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసెడెంట్ గా ఉన్నారు. అదేవిధంగా స్వతంత్ర ఎమ్మెల్యేగా గెలిచిన జిగ్నేశ్ ను కాంగ్రెస్ తన పార్టీలో చేర్చుకునే ప్రయత్నం చేస్తుంది. దీంతో ఆ వర్గం కూడా కాంగ్రెస్ కు అనుకూలంగా మారే అవకాశం ఉంది. మరోవైపు సీపీఐ యువజన విభాగం నేత కన్నయ్య కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమైపోయారు. వీరిద్దరు వచ్చే నెల 2వ తేదిన కాంగ్రెస్ లో చేరేందుకు ముహుర్తం ఖరారైంది. వరుసగా యువ నేతలంతా కాంగ్రెస్ పార్టీలో చేరుతుండటం ఆపార్టీకి కొత్త మైలేజ్ ను ఇస్తోంది.
బీజేపీ సైతం కాంగ్రెస్ పార్టీని ధీటుగా ఎదుర్కొనేందుకు అన్నివిధలా సిద్దమవుతోంది. పాటీదార్లను ఆకట్టుకునే వ్యూహాంలో భాగంగా బీజేపీ ఏకంగా ముఖ్యమంత్రినే మార్చివేసింది. గుజరాత్ లో ఓటమి పాలైతే ఆ ప్రభావం వచ్చే పార్లమెంట్ ఎన్నికలపై పడే అవకాశం ఉండటంతో ఈ ఎన్నికలను మోదీ-షా బృందం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దీంతో వారిద్దరు గుజరాత్ పై ప్రత్యేక నజర్ వేసినట్లు తెలుస్తోంది. దశాబ్దకాలంగా గుజరాత్ లో విజయాలు సాధిస్తున్న బీజేపీ ఈసారి అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తోంది. తద్వారా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఛాన్స్ లేకుండా చేయాలని అనుకుంటోంది. మొత్తానికి గుజరాత్ ఎన్నికలు మరోసారి హోరాహోరీగా జరుగడం ఖాయంగా కన్పిస్తున్నాయి. దీంతో ఈసారి ఎవరు పైచేయి సాధిస్తారనేది సస్పెన్స్ గా మారింది.