బద్వేల్ ఉప ఎన్నికల్లో వింత పరిస్థితి నెలకొంది. వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే రెండు పార్టీలు తాజాగా ఈ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నాయి. దీంతో ఈ ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అంతా భావిస్తున్నారు. సీఎం జగన్మోహన్ రెడ్డి సైతం ఈ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు తనవంతు ప్రయత్నం చేస్తున్నారు. అయితే వైసీపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేని పార్టీలు బరిలో నిలుస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఓడిపోతామని తెల్సినా సదరు పార్టీలు పోటీకి దిగుతుండడం వెనుక మతలబు ఏంటా? అనే చర్చ బద్వేల్ లో జోరుగా సాగుతోంది.
వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇటీవలే ఎన్నికల సంఘం బద్వేల్ ఉప ఎన్నికకు లైన్ క్లియర్ చేసింది. నామినేషన్ల ప్రక్రియ కూడా మొదలైంది. వైసీపీ నుంచి బద్వేల్ తాజా మాజీ ఎమ్మెల్యే సతీమణి బరిలో నిలిచారు. దీంతో ఆమె గెలుపు లాంఛనంగానే కన్పిస్తుంది. ఇక నోటిఫికేషన్ కంటే ముందే టీడీపీ ఇక్కడ అభ్యర్థిని ప్రకటించి ప్రచారం చేపట్టింది. ఈ ఎన్నికల్లో వైసీపీ మెజార్టీ తగ్గించాలని టీడీపీ ముందు నుంచి ప్రయత్నాలు చేపట్టింది. ఇక జనసేన-బీజేపీ అభ్యర్థి సైతం బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేస్తారనే ప్రచారం జరిగింది.
గత కొద్దిరోజులుగా ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్లు వార్ నడుస్తుంది. ఈక్రమంలోనే జనసేన ఇక్కడి నుంచి పోటీ చేస్తుందని అంతా భావించారు. కానీ అనుహ్యంగా పవన్ కల్యాణ్ బద్వేల్ ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. మరణించిన ఎమ్మెల్యే భార్యనే పోటీకి దింపడంతో రాజకీయ సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీకి దూరంగా ఉంటున్నట్లు పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు. ఇక జనసేన దారిలో టీడీపీ సైతం నడుస్తోంది. తాము కూడా బద్వేల్ ఉప ఎన్నిక నుంచి తప్పుకుంటున్నట్లు టీడీపీ అధినేత చంద్రబాబు ప్రకటించారు. దీంతో వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే రెండు ప్రధాన పార్టీలు బద్వేల్ ఉప ఎన్నిక నుంచి తప్పుకున్నట్లయింది.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇక్కడి ఉప ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు వైసీపీకి అవకాశం దొరికింది. అయితే అనుహ్యంగా ఓడిపోయే పార్టీలు బరిలో నిలుస్తుండటం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. వారసత్వ రాజకీయాలను తాము ప్రోత్సహించేది లేదంటూ బీజేపీ చెబుతోంది. ఈ క్రమంలోనే తాము బరిలో నిలుస్తామని ఆపార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. బీజేపీ దారిలోనే కాంగ్రెస్ సైతం పోటీకి సై అంటోంది. రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ ఏపీలో తుడుచుపెట్టుకొని పోయింది. అయినా సరే ప్రతీ ఎన్నికలోనూ ఆ పార్టీలో పోటీలో నిలుస్తుంది. ప్రతీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పోటీలో నిలుస్తూ వస్తోంది. తాజాగా బద్వేల్ లోనూ అదే సీన్ ను రిపీట్ చేస్తుంది.
బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ గెలుపు ఏకపక్షమని అందరికీ తెల్సిందే. గత ఎన్నికల్లోనూ వైసీపీ కడప జిల్లాను స్వీప్ చేసింది. సీఎం సొంత జిల్లా కావడంతో ఇక్కడ గెలుపు వైసీపీ నల్లేరు మీద నడకే అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. దీంతో రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, జనసేనలు ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నాయి. కానీ వైసీపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేని బీజేపీ, కాంగ్రెస్ లు పోటీలో నిలువడం ఆసక్తిని రేపుతోంది. కేవలం ఈ ఉప ఎన్నిక ఏకగీవ్రం కాకూడదనే ఉద్దేశ్యంతోనే ఆపార్టీలో బరిలో నిలుస్తున్నాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి బద్వేల్ ఉప ఎన్నిక ఏకగ్రీవం అయ్యే ఛాన్స్ లేదని స్పష్టమవుతోంది.