ముఖ్యమంత్రి జగన్.. మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారా? త్వరలోనే ఆయన దేశ రాజధానిలో ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా ను కలవనున్నారా? ఈ ప్రశ్నలకు.. అవుననే సమాధానం రాజకీయ వర్గాల నుంచి వినిపిస్తోంది. ఇప్పటికే.. ప్రధానితో పాటు కేంద్ర హోం మంత్రి అపాయింట్ మెంట్ సైతం జగన్ కోరినట్టుగా తెలుస్తోంది. త్వరలోనే సమావేశం ఖరారైతే.. జగన్ ఢిల్లీ బయల్దేరే అవకాశం ఉంది.
ఈ ఊహాగానాలు నిజమై ఢిల్లీకి వెళ్తే.. జగన్ ఏం చేయబోతున్నారు? కేంద్రం నుంచి ఎలాంటి హామీ తీసుకోబోతున్నారు? సంక్షేమ పథకాలను ఎలా పరుగులు పెట్టించబోతున్నారు? ఇతరత్రా ఇంకేమైనా విషయాలు ఉన్నాయా? అన్నది ఆంధ్రా రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికే.. రాష్ట్రం అప్పుల కారణంగా కాస్త ఇబ్బంది పడుతోంది. అవకాశం ఉన్న చోట.. ఆర్థిక వనరులు సమకూర్చుకుంటోంది. పథకాలను సరిగ్గా అమలు చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది.
మరోవైపు.. అప్పుల విషయంలో కేంద్రం రాష్ట్రాలకు పెట్టిన పరిమితి నిబంధనలు.. రాష్ట్ర ప్రభుత్వానికి అడ్డంకిగా మారుతున్నాయి. ఆర్థిక కష్టాలకు కారణాలవుతున్నాయి. కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మందగించిన ఆర్థిక స్థితి సైతం కాస్త ఇబ్బందికరంగానే పరిణమిస్తోంది. ఈ విషయాలను ఇప్పటికే.. కేంద్రం దృష్టికి సీఎం జగన్ తీసుకువెళ్లారు. మరోసారి ఈ విషయాన్ని వివరించి.. ఆర్థిక అండను కోరే అవకాశం ఉంది.
అలాగే.. అప్పులపై ఉన్న పరిమితి నుంచి రాష్ట్రానికి కాస్తైనా వెసులుబాటు ఇవ్వాలని ముఖ్యమంత్రి హోదాలో ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. ఈ రెండు ప్రయత్నాల్లో ఏ ఒక్కటి సఫలమైనా.. సంక్షేమ పథకాలను సజావుగా ముందుకు తీసుకుపోవచ్చన్న ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ఇప్పటికే.. ఎంత కష్టమైనా జనం ఆనందంగా ఉండాలన్నదే తమ లక్ష్యమని ప్రభుత్వం చెబుతూ.. పథకాలను అమలు చేస్తూ వస్తోంది.
ఈ క్రమంలో.. అటు ప్రజల్లో మాట పోకుండా.. ఇటు ప్రభుత్వ కార్యకలాపాలకు ఇబ్బంది ఎదురు కాకుండా ఉండేలా.. ముఖ్యమంత్రి జగన్ చర్యలు తీసుకుంటున్నట్టు కనిపిస్తోంది. అందులో భాగంగానే.. ఆయన మరోసారి ఢిల్లీకి వెళ్లి కేంద్ర పెద్దలకు రాష్ట్ర పరిస్థితులు వివరించి.. తగిన సహాయాన్ని అర్థించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే.. జగన్ ఢిల్లీ పర్యటనపై.. పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.