చాలా మంది పాము కనిపించగానే భయంతో వణికిపోతారు. కొందరు అక్కడి నుంచి సైతం పరుగులు తీస్తారు. అయితే చాలా అరుదుగా కొంతమంది మాత్రమే పాము దగ్గరకు వెళ్లి దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తారు. పాములను పట్టుకునే సమయంలో కాటు వేసే ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. అందుకే అనుభవం ఉన్నవారే ఇలాంటి పనులు చేయాలని నిపుణులు సూచిస్తారు.
ఇటీవల ఓ మహిళ పామును పట్టుకునే ప్రయత్నంలో పాము కాటుకు గురైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఒక గ్రామంలో పొదల్లో పాము దాక్కుంది. అది చూసిన స్థానికులు భయపడ్డారు. ఎవరూ దానిని పట్టుకోవడానికి ముందుకు రాలేదు. అయితే చీరకట్టులో ఉన్న ఓ మహిళ ధైర్యంగా ముందుకు వచ్చి పామును బయటకు తీశారు. ఆమె పామును పట్టుకుని సంచిలో వేసేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో, పాము అకస్మాత్తుగా తిరిగి ఆమె బుగ్గపై కాటు వేసింది. ఆ మహిళ భయంతో అరుస్తూ దాన్ని వదిలించుకునే ప్రయత్నం చేసినా, పాము కొంతసేపు ఆమె చెంపనే పట్టుకుంది. ఈ ఘటనను చూసిన వారు షాక్ అయ్యారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
పాము తోకను పట్టుకోవడం అత్యంత ప్రమాదకరమని నిఫుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఆ పరిస్థితిలో పాము తక్షణమే దాడి చేయడానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయన్నారు. తగిన శిక్షణ లేని వారు ఇలా ప్రయత్నించడం ప్రాణాపాయ స్థితులకు దారితీస్తుందని వారు హెచ్చరిస్తున్నారు.
వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. “ఇది చాలా ప్రమాదకరమైన స్టంట్”, “పాములతో వ్యవహరించడం చిన్నపిల్లల ఆట కాదు”, “ఇలాంటి పనులు నిపుణులే చేయాలి” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
పాములను పట్టుకోవడం అంతా ఈజీ కాదని.. సరైన శిక్షణ, అనుభవం, భద్రతలతో పాములను పట్టుకోవాలని నిపుణులు సూచిస్తన్నారు.