వర్క్ ఫ్రమ్ హోమ్ కు స్వస్తి పలకాలనే ఉద్ధేశ్యంతో ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. ఉద్యోగులను ఆఫీస్ కు రప్పించాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. వచ్చే ఏడాది నుంచి వారంలో కనీసం మూడు రోజులైనా ఆఫీస్ కు రావాలని మైక్రోసాఫ్ట్ కంపెనీ తేల్చి చెప్పింది.
పూర్తి వివరాల్లోకి వెళితే.. ఐటీ ఉద్యోగులను ఎలాగైనా ఆఫీసులకు రప్పించాలని ఐటీ కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. వారంలో ఖచ్చితంగా మూడు రోజులు ఆఫీస్ కు వచ్చేలా ప్లాన్ చేస్తున్నాయి. ఈ విధానాన్ని మూడు దశల్లో అమలుచేయనున్నట్లు మైక్రోసాఫ్ట్ చీఫ్ పీపుల్ ఆఫీసర్ అమీ కోల్‌మాన్ బ్లాగ్‌లో పేర్కొన్నారు. వాషింగ్టన్, రెడ్‌మండ్ కంపెనీ ప్రధాన కార్యాలయంలోని ఉద్యోగులతో దీన్ని మొదలుపెట్టనున్నట్లు తెలిపారు. ఆ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న కార్యాలయాల్లో ఇదే విధానం అమలవుతుందని వెల్లడించారు. కంపెనీ ప్రధాన కార్యాలయం నుంచి 50 మైళ్ల దూరంలో నివసించే ఉద్యోగులకు 2026 ఫిబ్రవరి చివరి నుంచి ఈ విధానం అమలుకానున్నట్లు తెలిపారు. అమెరికాలోని మిగిలిన ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చే విషయానికి సంబంధించిన వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని తెలిపింది.
కరోనా కాలంలో స్టార్టైన ఈ కల్చర్ నుంచి దాదాపు అన్ని కంపెనీలు బయటకు వస్తున్నాయి. తమ ఉద్యోగుల్ని తిరిగి ఆఫీసులకు రప్పించేందుకు ఐటీ సంస్థలు అనేక చర్యలు చేపడుతున్నాయి. హెచ్‌సీఎల్, అమెజాన్ (Amazon), ఇన్ఫోసిస్ (Infosys), టీసీఎస్ (TCS) వంటి కంపెనీలు ఇప్పటికే ఉద్యోగులను ఆఫీసుకు వచ్చి పనిచేసేలా ప్రోత్సహిస్తున్నాయి.