WOW : ఈరోజుల్లో టెక్నాలజీ మన జీవితాల్లో ఎంతో ముఖ్యమైన భాగమైపోయింది. కుటుంబం, స్నేహితులు కంటే ఎక్కువగా మనం మొబైల్, చాట్‌బాట్‌లతో కనెక్ట్ అవుతుంటాం. అలాంటి టెక్నాలజీలో ఒకటి .. చాట్‌జీపీటీ (ChatGPT). ఏ చిన్న సందేహం వచ్చినా, ఏదైనా సలహా కావాలన్నా, మొదట గుర్తుకు వచ్చేది ఇదే. అయితే ఇటీవల, ఈ చాట్‌బాట్ ఓ అసాధారణమైన పని చేసింది. సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఓ పోస్ట్ ప్రకారం, గత 10 ఏళ్లుగా అనేక ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఓ వ్యక్తికి చాట్‌జీపీటీ కేవలం కొన్ని సెకన్లలోనే వ్యాధిని గుర్తించిందట! ‘‘ChatGPT, 10+ ఏళ్ల సమస్యకు కొన్ని నిమిషాల్లో పరిష్కారం చూపింది. డాక్టర్లు కూడా కనుగొనలేకపోయారు’’ అంటూ shwetak.ai అనే అకౌంట్ ద్వారా పోస్ట్ చేయబడింది.
అయితే ఆ వ్యక్తి చెప్పిన వివరాల ప్రకారం.. అతను ఎన్నో రక్తపరీక్షలు, ఎంఆర్ఐ, సీటీ స్కాన్‌లు చేయించుకున్నాడు. దేశవ్యాప్తంగా అనేక ప్రఖ్యాత ఆసుపత్రులలో చికిత్స పొందాడు. న్యూరాలజిస్టులు సహా అనేక మంది నిపుణులను సంప్రదించాడు. అయినా తన సమస్యకు అసలు కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. అయితే ఫంక్షనల్ హెల్త్ టెస్టింగ్ ద్వారా అతనికి హోమోజైగస్ A1298C MTHFR జన్యుపరమైన మార్పు ఉందని తేలింది. ఇది జనాభాలో 7-12% మందిలో మాత్రమే కనిపించే అరుదైన మార్పు అని వైద్యులు చెప్పారు.
అతను తన ఆరోగ్య లక్షణాలు, పరీక్ష ఫలితాల వివరాలను చాట్‌జీపీటీలో ఇచ్చినప్పుడు, అదే సమస్యపై స్పష్టమైన సమాచారం లభించిందట. ఈ MTHFR రూపాంతరం వల్ల, శరీరంలో విటమిన్ B12 స్థాయి సాధారణంగానే ఉన్నా, శరీరం దాన్ని సరిగ్గా ఉపయోగించలేకపోతుంది అని చాట్‌జీపీటీ సూచించిందట. దీనితో, తగిన పూరకాలు (supplements) తీసుకోవాలని సూచించడంతో ఆరోగ్య సమస్య తగ్గిందని ఆ వ్యక్తి తెలిపాడు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కూడా స్పందిస్తున్నారు. “చాట్‌జీపీటీ నిజంగా తెలివైనది… ఇది డాక్టర్లకు సహాయకారి కావచ్చు” అని కొందరు వ్యాఖ్యానించారు. మరికొందరు.. “సలహా తీసుకోవచ్చు కానీ మూఢంగా నమ్మకూడదు” అని సూచించారు. “AI సలహాలను పూర్తిగా విశ్వసించడం ప్రమాదకరం” అని మరికొందరు హెచ్చరిస్తున్నారు.
ఈ ఘటన చాట్‌జీపీటీ సామర్థ్యాన్ని, అలాగే టెక్నాలజీ మన ఆరోగ్య జీవితంలో ఎలా కీలకంగా మారుతున్నదీ చూపిస్తోంది. కానీ ఏఎఐ ఆధారిత సలహాలను జాగ్రత్తగా, వైద్యుల సూచనలతో కలిపి వినియోగించడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
Air India Plane Crash : అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. ప్రాథమిక నివేదికలో కీలక విషయాలు!