కంటికి కనిపించేవన్నీ నిజం కావు అన్నట్టు.. రోడ్డు పక్కన భిక్షాటన చేసుకొనే ప్రతీ బిచ్చగాడు పేదోడు కాదు. వాళ్ళలో కొందరు బిచ్చం ఎత్తుకునే, ఎంతో డబ్బు సంపాదించి ఉంటారు. కొందరు కోటీశ్వరులుగా అవతరించిన వాళ్ళను సైతం మనం చూశాం. ఇప్పుడు తాజాగా ఓ బిచ్చగాడు తన భార్య కోరిక తీర్చాడు. ఆ కోరిక ఖరీదు పదో పరకో కాదు.. అక్షరాల రూ. 90 వేలు! ఆ వివరాల్లోకి వెళ్తే..
మధ్యప్రదేశ్‌లో సంతోష్ కుమార్ సాహు అనే ఓ యాచకుడు తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. ఒక రోజు తనకు మోటార్ బైక్‌పై తిరగాలని ఉందని భార్య తన కోరిక వెలిబుచ్చింది. అంతే.. మరేం ఆలోచించకుండా భిక్షాటన చేసి, డబ్బులు కూడబెట్టి, ఏకంగా రూ. 90 వేలు విలువ చేసే వాహనాన్ని కొనుగోలు చేశారు. తన భార్యతో కలిసి, ఎంచక్కా షికార్లు కొట్టడం మొదలుపెట్టాడు. ఈ దృశ్యం చూసి, చుట్టుపక్కల ఉన్న జనాలు షాకయ్యారు. భిక్షాటన చేసుకొని జీవితం కొనసాగించే ఇతని వద్ద.. ఒక మోటార్ బైక్ కూడా ఉందా? అంటూ అవాక్కయ్యారు. ఈ నేపథ్యంలోనే సాహు పాపులర్ అయిపోయాడు.
ఇక్కడ మరో ట్విస్ట్ ఏమిటంటే.. గతంలోనే అతని వద్ద ఓ బైక్ ఉండేదట! అయితే, ఆ వాహనంపై ప్రయాణం చేయడం వల్ల తన భార్యకు వెన్ను నొప్పి వచ్చేదని, దీంతో దాన్ని పక్కన పెట్టేశామని తెలిపాడు. మళ్ళీ డబ్బులు కూడబెట్టి, ఈ కొత్త బైక్ కొనుగోలు చేశామని చెప్పాడు. భార్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఖరీదైన బైక్ కొనుగోలు చేయడంతో.. భార్యపై అతనికున్న ప్రేమని చూసి నెటిజన్లు కొనియాడుతున్నారు. బిచ్చగాడు సినిమాలో హీరో కోట్లు వదిలిపెట్టి బిచ్చం ఎత్తితే, ఇక్కడ ఈ బిచ్చగాడు భార్య కోసం డబ్బులు కూడబెట్టి బైక్ కొననుగోలు చేశాడు.