India EV market: మరో ఏడేళ్లలో మన దేశంలో ఎక్కడ చూసినా విద్యుత్ వాహనాలే కనిపించనున్నాయి. ఎందుకంటే ఆ వాహనాల అమ్మకాలు 2030 నాటికి ఏటా కోటి యూనిట్లకు చేరుకోనున్నాయి. ఈ విషయాన్ని ఆర్థిక సర్వే-2023 పేర్కొంది. భారతదేశం హరిత ఇంధనం దిశగా పయనించటంలో ఆటోమోటివ్ ఇండస్ట్రీ కీలక పాత్ర పోషించనుందని ఎకనమిక్ సర్వే అంచనా వేసింది.
2022 నుంచి 2030 వరకు దేశీయ విద్యుత్ వాహనాల మార్కెట్ ఏటా 49 శాతం వృద్ధి రేటును నమోదు చేస్తుందని వెల్లడించింది. ఈవీ మార్కెట్ 2030 నాటికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా 5 కోట్ల మందికి ఉపాధి కల్పిస్తుందని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఈవీ ఇండస్ట్రీ ఈ స్థాయిలో గ్రోత్ రేట్ సాధించేందుకు ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టినట్లు తెలిపింది.
read more: Indian Box Office Report: సినిమా హాల్స్ ఇక క్లోజ్ అనే డౌట్లు పటాపంచలు
ముఖ్యంగా.. అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్స్ తయారీకి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని వర్తింపజేయటాన్ని ఆర్థిక సర్వే ప్రముఖంగా ప్రస్తావించింది. అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్స్ తయారీ పెరిగితే ఎలక్ట్రిక్ వెహికిల్స్ వాడకం పెరుగుతుందని పేర్కొంది. 2023 ఆర్థిక సంవత్సరం నుంచి 2027 ఆర్థిక సంవత్సరం వరకు అమల్లో ఉండనున్న ఈ పథకం కింద ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుందని ఎకనమిక్ సర్వే వెల్లడించింది.
ఫాస్టర్ అడాప్షన్ అండ్ మ్యానిఫ్యాక్షరింగ్ ఆఫ్ ఎలక్ట్రిక్ వెహికిల్స్.. ఎఫ్‌ఏఎంఈ.. ఫేమ్.. అనే పథకం రెండో దశ 2019వ సంవత్సరం నుంచి 2024వ సంవత్సరం వరకు అమల్లో ఉంటుందని పేర్కొంది. ఇందులో భాగంగా 10 వేల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారని, ఇప్పటికే 7 లక్షలకు పైగా విద్యుత్ వాహనాలకు ప్రోత్సాహకం అందించామని గుర్తుచేసింది. 7 వేల 210 ఇ-బస్‌లకు అనుమతించగా అందులో 2 వేల 172 బస్సులు గతేడాది డిసెంబర్ లోపే అందుబాటులోకి వచ్చాయని ఆర్థిక సర్వే-2023 వివరించింది.