Guptajiinvests: ఓ వ్యక్తి పల్లెటూరులో పుట్టి పెరిగాడు. చిన్న స్కూల్లో చదువుకున్నాడు. జిల్లా కేంద్రానికి తప్ప సిటీకి రెగ్యులర్‌గా వెళ్లే స్థాయి కూడా కాదు అతనిది. ఏడాదికో రెండేళ్లకో ఒకసారి నగరానికి వెళ్లివస్తుండేవాడు. జీవితంలో పెద్ద విజయాలు సిటీల్లో ఉండేవారికే సాధ్యమని, వాళ్లకు మాత్రమే ఆ ఎకోసిస్టమ్, కల్చర్ ఉంటాయని నమ్మాడు. అంతేకాదు. తననుతాను యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్‌గా తక్కువ అంచనా వేసుకున్నాడు. అలాంటి తనకు ఒకరు ఉద్యోగం ఇవ్వటం గొప్పేనని ఆత్మన్యూనతకు లోనయ్యాడు.
కానీ.. అదే వ్యక్తి ఇప్పుడు దానికి పూర్తి భిన్నంగా మారిపోయాడు. ఇంతకుముందు చెప్పుకున్నవన్నీ సరికాదని, విలేజ్‌లో పుట్టి పెరిగినప్పటికీ పట్టుదల ఉంటే మనం కూడా పైకి రావొచ్చని నిరూపించాడు. అతనే.. రవితేజ గుప్తా. నిజామాబాద్‌వాసి అయిన ఇతను ఆ ప్రాంతానికే చెందిన ‘రెడ్‌బస్’ కోఫౌండర్ ‘ఫణింద్ర సామా’ను చూసి ఇన్‌స్పైర్ అయ్యాడు. కొత్తగా(ఇన్నోవేటివ్‌గా) ఆలోచించి ‘గుప్తాజీ ఇన్వెస్ట్స్’ను స్థాపించాడు. దాని ద్వారా.. స్టార్టప్ ఫౌండర్లను, గుప్తా కమ్యూనిటీ ఇన్వెస్టర్లను, ప్రొఫెషనల్స్‌ను, ఔత్సాహిక పెట్టుబడిదారులను ఒక్క చోటకు చేర్చుతున్నాడు.
బిజినెస్ చేయాలనే ఆలోచనతో ఎవరైనా తమను సంప్రదిస్తే వాళ్లకు సలహాలు, సూచనలు, మార్కెట్ యాక్సెస్, మెంటారింగ్ అందిస్తున్నాడు. అన్నీ ఓకే అయ్యాక ఇన్వెస్టర్ల ద్వారా పెట్టుబడి సొమ్మును సైతం ఇప్పిస్తున్నాడు. స్టార్టప్ ఫౌండర్లు ఏ కమ్యూనిటీవాళ్లయినా కావొచ్చు. వాళ్లకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా, మార్కెట్ ట్రెండ్స్ అనలైజర్‌గా, అసెట్స్ మేనేజర్‌గా, ఫైనాన్షియల్ రిస్క్ రెడ్యూజర్‌గా వ్యవహరిస్తున్నాడు. సాధించాలని మనసు కలిగితే కాదేదీ మీకసాధ్యం అంటూ ఔత్సాహిక వ్యాపారవేత్తలను ప్రోత్సహిస్తున్నాడు. వాళ్ల కలలను, లక్ష్యాలను సాకారం చేసేందుకు పాటుపడుతున్నాడు.
బిజినెస్‌నే సర్వస్వంగా భావిస్తాడు, బిజినెస్‌నే ఇష్టపడతాడు, బిజినెస్ గురించే ఆలోచిస్తాడు, బిజినెస్ చేయాలని మాత్రమే కోరుకుంటాడు. టెక్నాలజీలో 5జీ, వెబ్3 వంటి అడ్వాన్స్‌మెంట్లు వస్తున్న నేపథ్యంలో వినియోగదారుల వ్యవహారశైలిలోనూ మార్పు వచ్చిందని ‘గుప్తాజీ ఇన్వెస్ట్స్’ చెబుతోంది. కస్టమర్లు కోరుకునేదాన్నే బిజినెస్‌లు ఇవ్వాలంటోంది. కానీ.. సంప్రదాయ వ్యాపారాలు ఈ దిశగా మార్పు కనబరచట్లేదని, అందుకే ఇన్నోవేటర్స్ స్టార్టప్స్ ఫౌండర్లుగా ఎదుగుతున్నారని వివరిస్తోంది. ఈ మేరకు ‘గుప్తాజీ ఇన్వెస్ట్స్’ సాగిస్తున్న ప్రయాణాన్ని ‘ఎన్-బిజినెస్ ఇన్‌సైడర్’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రవితేజ గుప్తా వెల్లడించాడు.