Flipkart Fined: ముందుగానే డబ్బు తీసుకున్నప్పటికీ.. ఫోన్ డెలివరీ చేయకుండా తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఇ-కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కి భారీ జరిమానా పడింది. ఫోన్ ఖరీదు 12 వేల 499 రూపాయలు కాగా ఆ మొత్తంతోపాటు దానికి వార్షిక వడ్డీ 12 శాతం చెల్లించాలని వినియోగదారుల కోర్టు ఆదేశించింది. 20 వేల రూపాయల ఫైన్ మరియు లీగల్ ఖర్చుల కింద 10 వేల రూపాయలు కూడా కస్టమర్‌కి కట్టాలని స్పష్టం చేసింది.
బెంగళూరు అర్బన్ జిల్లా వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ ఈ తీర్పు ఇచ్చింది. సిటీకి చెందిన దివ్యశ్రీ అనే వినియోగదారు 2022 జనవరి 15వ తేదీన ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ బుక్ చేశారు. ఆ ఆన్‌లైన్ ఆర్డర్ ప్రకారం.. మరుసటి రోజే ఫోన్ డెలివరీ కావాల్సి ఉన్నా కాలేదు. దీంతో ఆమె ఫ్లిప్‌కార్ట్ కస్టమర్ కేర్ నంబర్‌కి పలుమార్లు కాల్ చేశారు. అయినా ఫలితం లేకపోయింది. ఈ నేపథ్యంలో బాధితురాలు కన్జ్యూమర్ కమిషన్‌లో ఫిర్యాదు చేశారు.
read more: Elon Musk: ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్ ఫండ్ రైజ్. ట్విట్టర్ ఎఫెక్ట్?
దీనిపై స్పందించిన కమిషన్.. సంబంధిత ప్రతినిధిని తమ వద్దకు పంపాలంటూ నోటీస్ ఇచ్చినప్పటికీ ఫ్లిప్‌కార్ట్ పట్టించుకోలేదు. తద్వారా.. కమిషన్ ఆదేశాలను ధిక్కరించటం, ఫోన్ డెలివరీలో నెగ్‌లెక్ట్‌గా వ్యహరించటం, కస్టమర్‌ని ఆర్థికంగా నష్టపరచటం, మానసిక క్షోభకు గురిచేయటం వంటి అనైతిక పద్ధతులకు పాల్పడింది. దీంతో.. ఫ్లిప్‌కార్ట్ మూల్యం చెల్లించాలంటూ వినియోగదారుల కమిషన్ తన ఆదేశాల్లో పేర్కొంది.