Special Interview with World Renowned Gastroenterologist Dr. Guru N Reddy: డాక్టర్ గురు ఎన్ రెడ్డి.. ప్రపంచ ప్రఖ్యాత గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్. హైదరాబాద్‌లోని ప్రముఖ కాంటినెంటల్ హాస్పిటల్స్ ఫౌండర్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ మాత్రమే కాదు. వైద్యంలో నాలుగు దశాబ్దాలకు పైగా విశేష అనుభవం కలిగిన విశిష్ట వ్యక్తి. ఈ రంగంలో అద్భుత విజయాలను సాధించిన ముందుచూపున్న మంచి మనిషి. ప్రజల నాడిని పట్టడంలోనే కాకుండా ప్రభుత్వాలకు విలువైన సలహాలు సూచనలు ఇవ్వటంలో కూడా ముందు వరుసలో నిలుస్తున్నారు.
తన జీవితం ఒక చలన చిత్రంలా అనిపిస్తుంటుందని పేర్కొన్న డాక్టర్ గురు ఎన్ రెడ్డి గురించి ఒక్క మాటలో చెప్పాలంటే వైద్యుడిగా విదేశాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉన్నా మాతృభూమిని మర్చిపోని ముద్దు బిడ్డ. ఉస్మానియా మెడికల్ కాలేజీ గోల్డ్ మెడలిస్టుగా ప్రతిభను చాటుకొని అగ్రరాజ్యం అమెరికాలోని ప్రసిద్ధ టెక్సాస్ మెడికల్ సెంటర్‌లో ఉన్నత విద్య అభ్యసించారు. హ్యూస్టన్ సిటీలో గ్యాస్ట్రోఎంటరాలజీ సెంటర్‌ను స్థాపించి అత్యుత్తమ వైద్య కేంద్రాల్లో ఒకటిగా తీర్చిదిద్దారు. పదేళ్ల కిందట హైదరాబాద్ మహా నగరం నడిబొడ్డున కాంటినెంటల్ హాస్పిటల్స్‌కు శ్రీకారం చుట్టారు.
ఆ ఆసుపత్రి ఇప్పుడు అంతర్జాతీయ ప్రమాణాలతో అత్యున్నత వైద్యాన్ని అందిస్తోంది. 30 ప్రత్యేక విభాగాలు, 700కి పైగా మెడికల్ బెడ్లతో అసంఖ్యాక జీవితాలకు ఆయువు పోస్తోంది. లైఫ్‌లో ఏం చేసినా కూడా నంబర్ వన్ పొజిషన్‌లో ఉండాలనేదే తన కోరిక అని తెలిపారు. అమెరికాలో ఉన్నా, ఇండియాలో ఉన్నా తనకు కేవలం ఒక స్టూడెంట్‌లాగో, ఒక డాక్టర్‌లాగో కాకుండా లీడర్‌షిప్ రోల్స్ లభించాయని, అది తన అదృష్టమన్నారు. కరోనా సమయంలో, క్రిటికల్ పరిస్థితుల్లో, ఏ హాస్పిటల్‌లోనూ చేర్చుకోని ఒక గర్భిణి తన ఆస్పత్రికి వస్తే అడ్మిట్ చేసుకొని, ఎంతో జాగ్రత్తగా 24/7 వైద్యం అందించి, తల్లీబిడ్డ ఇద్దరి ప్రాణాలనూ నిలబెట్టామని గుర్తుచేసుకున్నారు.
ఇలాంటి మరిన్ని ముఖ్యమైన విషయాలను డాక్టర్ గురు ఎన్ రెడ్డి ‘ఎన్-బిజినెస్ ఐకాన్స్’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. తన దృష్టిలో బెస్ట్ అంటే ఎవరేది చెప్పారు. వైద్యుడిగా ఒక తల్లికి ఆమె బిడ్డ ప్రాణాన్ని కాపాడటాన్ని మించి ఏమివ్వగలమని ఎమోషన్‌గా పేర్కొన్నారు. ఆద్యంతం ఆకట్టుకుంటున్న ఈ ఇంటర్వ్యూ తప్పక చూడాల్సినవాటిలో ఒకటని చెప్పటంలో అతిశయోక్తిలేదు.