Amazon founder warned about recession: సొమ్ములే ఆదా.. చెయ్యరా భాయి.. డాబుకే పోక.. డబ్బు పోగెయ్యి.. అని తెలుగు రచయిత చంద్రబోస్ 20 సంవత్సరాల క్రితమే బడ్జెట్ పద్మనాభం అనే మూవీ కోసం ఒక చక్కని పాట రాశారు. అమేజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ కూడా ఇప్పుడు అదే చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఎకానమీ ఏమంత బాగా లేదని, అందుకే అన్ని రంగాల్లోనూ ఉద్యోగ కోతలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఆర్థిక సంక్షోభం సవాళ్లు విసురుతోందని చెప్పారు. అందువల్ల ఎవరూ కూడా అనవసర ఖర్చులకు పోవద్దని, సాధ్యమైనంత ఎక్కువ మనీ సేవ్ చేయాలని సూచించారు.
‘‘టీవీలు, ఫ్రిజ్‌లు, బైక్‌లు తదితర కొత్త వస్తువులు, విలాస వస్తువులు కొనాలనుకునేవారు ఆ ప్రయత్నాలను కొన్నాళ్లపాటు పక్కన పెట్టడం మంచిది. గతంలో మాదిరిగా ఇప్పుడు వెనకా ముందు ఆలోచించకుండా వ్యవహరించకూడదు. లేదు.. లేదు.. మేం ఎప్పట్లాగే ఉంటాం అంటే మాత్రం ఫైనాన్షియల్ గా పెద్ద రిస్కులోనే పడతారు’’ అని జెఫ్ బెజోస్ హెచ్చరించారు. బడా టెక్నాలజీ సంస్థలు సైతం కాస్ట్ కటింగులకు దిగుతుండటంతోపాటు ద్రవ్యోల్బణం కట్టడికి అన్ని దేశాల కేంద్ర బ్యాంకులు వడ్డీ రేట్లను పెంచుతున్న నేపథ్యంలో అమేజాన్ ఫౌండర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
read more: Special Story on Vikram S Kirloskar: మన దేశ ఆటోమొబైల్ రంగానికి మార్గదర్శకుడు
ఆర్థిక సంక్షోభంపై జెఫ్ బెజోస్ ఇలా స్పందించటం ఇదే తొలిసారి కాదు. గత వారం కూడా ఆయన ఇదే గుర్తుచేశారు. ఎకానమీ డౌన్ అవుతోందని పేర్కొన్నారు. ఆర్థిక సంక్షోభ ప్రభావం ఇప్పటికిప్పుడు ప్రత్యక్షంగా కనిపించకపోవచ్చు. కానీ అతిత్వరలోనే అది మనకు పరోక్షంగా అనుభవంలోకి రాబోతోందని అన్నారు. కుబేరుల్లో ఒకరైన అమేజాన్ ఫౌండర్ జెఫ్ బెజోసే ఇలా ఒకటికి రెండు సార్లు అలర్ట్ చేశారంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉండబోతోందో అర్థంచేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి.. తస్మాత్ జాగ్రత్త.