కలిసి పనిచేయాలని వైసీపీ అధినేత ఆదేశించినా ఆ యువ నేతలు ఖాతరు చేయడం లేదా? ఇప్పటికీ ఎడముఖం పెడముఖమేనా? అమీతుమీ తేల్చుకోవడానికే సిద్ధపడ్డారా? ఎవరా నాయకులు? ఏమా కథ?
కలిసి మీడియా ముందుకు రాలేదు..!
రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌రామ్, రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మధ్య రగడపై పది రోజుల క్రితమే వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎదుట పంచాయితీ జరిగింది. ఇద్దరినీ కలిసి పనిచేయాలని అధినేత ఆదేశించినట్టు సమాచారం. కానీ.. క్షేత్రస్థాయిలో వర్గాలు ఏకం కాలేదు. పగలు చల్లారలేదు. తాజాగా ఇద్దరినీ కలిపి ఒకే వేదికపై మీడియాతో మాట్లాడించేందుకు రాజమండ్రి పార్లమెంటరీ పార్టీ వైసీపీ ఇంఛార్జ్, ఎమ్మెల్సీ కొయ్యే మోషేన్‌రాజు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో అధికారపార్టీలో భరత్, రాజాల వైఖరి చర్చగా మారింది.
ఇద్దరికీ సీఎం జగన్ వార్నింగ్ ఇచ్చినట్టు పార్టీలో చర్చ..!
భరత్, రాజాల పంచాయితీ తాడేపల్లి చేరినప్పుడు వీరిద్దరితో ముందుగా ఉభయ గోదావరి జిల్లాలో వైసీపీ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు. తర్వాత సీఎం జగన్ దగ్గరకు వాళ్లను తీసుకెళ్లారు. ఆ సమయంలో ఇద్దరిపై సీఎం జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు పార్టీలో చర్చ జరుగుతోంది. ఎవరైనా తప్పు చేసినట్టు తెలితే సమయం వచ్చినప్పుడు చర్యలు తీసుకుంటామని.. పార్టీకి నష్టం రాకుండా వ్యవహరించాలని వార్నింగ్ ఇచ్చారట. ఆ భేటీ తర్వాత ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడింది లేదు. సీఎం దగ్గర సమస్య పరిష్కారమైందా లేదా అని ఎమ్మెల్యే రాజా సైతం నోరు మెదప లేదు. ఇటీవలే ఇద్దరితో వేర్వేరుగా భేటీ అయ్యి చర్చించారు పార్టీ ఇంఛార్జ్ వైవీ సుబ్బారెడ్డి. అయినప్పటికీ భరత్, రాజాలలో మార్పు రాలేదని ప్రచారం జరుగుతోంది.
ఇద్దరి మధ్య ఆధిపత్యపోరేనా.. ఇంకేమైనా ఉందా?
ఎంపీ, ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్య పోరేనా.. ఇంకేమైనా సమస్యలున్నాయా అనే కోణంలో వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. భరత్‌పై చేసిన అవినీతి ఆరోపణలను వెనక్కి తీసుకోవడానికి రాజా ఇష్టపడటం లేదట. తేల్చుకునే వరకు తగ్గేది లేదని రాజా చెబుతున్నారట. ఇక రాజా వెనక బ్లేడ్ బ్యాచ్, రౌడీషీటర్లు ఉన్నారని ఆరోపిస్తున్న భరత్.. వాటిని ఉపేక్షించేది లేదని అంటున్నారట. దీంతో తీరు మారని ఈ యువనేతలపై పార్టీ పెద్దలు కూడా కోపంగా ఉన్నట్టు సమాచారం.
పార్టీ నేతలకు రాజమండ్రిలో డివిజన్ల వారీగా బాధ్యతలు
ఇద్దరి మధ్య సఖ్యత కుదరకపోతే.. రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీ నేతలకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించే ప్లాన్ వైసీపీ పెద్దల్లో ఉందట. సిటీ పార్టీ కోఆర్డినేటర్ ఆకుల సత్యనారాయణ వ్యక్తిగత కారణాలతో దూరంగా ఉంటున్నారు. ఎంపీ, ఎమ్మెల్యేలకు, మాజీ కోఆర్డినేటర్లకు, మాజీ ఎమ్మెల్యేలకు వేర్వేరుగా కొన్ని డివిజన్లు అప్పగిస్తారని టాక్. రాజమండ్రి వైసీపీలో నేతలు ఎక్కువ. అలాగే వారి మధ్య సఖ్యత లేక సమస్యలూ ఎక్కువే. మరి.. అధికారపార్టీ ఎలాంటి మంత్రం వేస్తుందో చూడాలి.