పెళ్లి అనేది ప్రతి ఒక్కరి జీవితంలో మధురానుభూతి. జీవితంలో ఒక్కసారే జరిగే అద్భుతమైన వేడుక. అందుకే కాస్త ఆలస్యమైనా మంచి ముహూర్తం చూసుకుని పెళ్లిళ్లు చేస్తుంటారు. అయితే కరోనాతో గత రెండేళ్లుగా పెళ్లిళ్లు తగ్గిపోయాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మంచి ముహూర్తాలు ఉండటం, కరోనా ఉధృతి తగ్గడంతో తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల హడావిడి నెలకొంది. అయితే ఈ ఏడాది జూన్ నెల దాటితే ముహూర్తాలు లేవని పండితులు స్పష్టం చేస్తున్నారు. మళ్లీ డిసెంబర్ వరకు ముహూర్తాలు లేకపోవడంతో కొందరు శుభకార్యాలు చేసేందుకు తహతహలాడుతున్నారు.
ముఖ్యంగా చాలా మందికి వేసవి సెలవులు ఉండటంతో గత రెండు నెలలుగా ఏపీ, తెలంగాణలో వేలాది వివాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం జూన్ 26వ తేదీ వరకు మంచి ముహూర్తాలు ఉన్నాయి. ఆ తర్వాత ఆగస్టులో నాలుగైదు ముహూర్తాలు ఉన్నా ఆషాడం, శుక్ర మూఢం కారణంగా డిసెంబర్ వరకు మంచి ముహూర్తాలు అయితే లేవు. డిసెంబర్ 1వ తేదీతో శుక్ర మూఢం ముగుస్తుంది. అనంతరం శుభ ముహూర్తాలు ప్రారంభమవుతాయని పండితులు చెప్తున్నారు. ఇప్పటికే సంబంధాలు ఫిక్స్ చేసుకున్న వాళ్లు ఆరునెలల పాటు వేచి చూడటం కంటే వెంటనే పెళ్లిళ్లు జరిపేందుకు సిద్ధపడుతున్నారు. ఈ నేపథ్యంలో కళ్యాణ మండపాలు, డెకరేషన్, క్యాటరింగ్ సిబ్బందికి మంచి డిమాండ్ ఏర్పడుతోంది.