ఆ జంటకు ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది.. అనతికాలంలోనే వ్యక్తిగతంగా కలుసుకున్నారు.. చూస్తుండగానే ఆ పరిచయం ప్రేమగా మారడంతో పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు.. అయితే, పెళ్ళయ్యాక అసలు విషయం తెలిసి వరుడు సహా అతని కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు.. ఇంత దారుణమైన మోసం చేస్తావా అంటూ ఆ వధువుని చితకబాదారు. అసలేం జరిగిందంటే..
పశ్చిమ బెంగాల్‌లోని నార్త్ 24 పరగనాస్ జిల్లాకు అలోక్ కుమార్ మిస్త్రీకి కొన్ని రోజుల క్రితం ఒడిశాలోని పఢా జిల్లాకు చెందిన మేఘనతో ఫేస్‌బుక్‌లో పరిచయం ఏర్పడింది. అప్పట్నుంచే వీళ్ళు తరచు మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. దీంతో, వీరి పరిచయం 15 రోజుల్లోనే ప్రేమగా మారింది. ఈ నేపథ్యంలోనే మే 24వ తేదీన వీళ్ళు కలుసుకున్నారు. అప్పుడే పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అలా అనుకోవడమే ఆలస్యం, కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించారు. ఇంకేముంది.. కుటుంబ సభ్యుల సమక్షంలో వారి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. అదే రోజు సాయంత్రం వరుడి ఇంట్లో రిసెప్షన్ ఏర్పాటు చేశారు. అక్కడే అసలు ట్విస్ట్ రివీల్ అయ్యింది.
ఆ రిసెప్షన్‌కి వచ్చిన ఓ అతిథి.. పెళ్ళికూతురు అమ్మాయి కాదు, అబ్బాయి అని బాంబ్ పేల్చాడు. అతని పేరు మేఘన కాదని, మేఘనాథ్ అని కుండబద్దలు కొట్టాడు. అతడు తమకు దగ్గరి బంధువేనని చెప్పాడు. దీంతో అందరూ అవాక్కయ్యారు. తనని దారుణంగా మోసి చేసినందుకు తీవ్ర కోపాద్రిక్తుడైన వరుడు.. మేఘనాథ్‌ని చితకబాదాడు. గ్రామస్థులు సైతం అతడ్ని కట్టేసి కొట్టారు. అనంతరం మేఘనాథ్‌పై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.