ఇవాళ గురుపూర్ణిమ. ఈ రోజు గురువుల ఆశీర్వాదం పొందితే పుణ్యమని ప్రగాఢ నమ్మకం. ఏటా ఆషాఢ మాసంలో శుద్ధ పౌర్ణమి నాడు ఈ పండుగ చేసుకుంటారు. మనిషిని సక్రమ మార్గంలో పెట్టి ముక్తి వైపు నడిపించే వ్యక్తులను గురువులుగా భావిస్తారు. తల్లి, తండ్రి, గురువు, దైవం వీళ్లందరి ప్రభావం మన జీవితం మీద ఉంటుంది. అందుకే విద్యార్థులు గురువులతోపాటు తల్లిదండ్రులకు కూడా ఈ సందర్భంగా భక్తిశ్రద్ధలతో పాదపూజ చేసి ఆ నీళ్లను నెత్తి మీద చల్లుకుంటారు. గురువులకే గురువు వేదవ్యాసుడు అంటారు. ఆయన జన్మదినం కూడా ఈ రోజే కావటం వల్ల గురుపూర్ణిమకు ఇంతటి విశేషం వచ్చింది.
ఇవాళ మిగతా ఆలయాలతో పోల్చితే సాయిబాబా గుళ్లల్లోనే సందడి నెలకొనటానికి కారణం దక్షిణ భారతదేశంలో ఎక్కువ మంది భక్తులు షిర్డీ సాయిబాబాను గురువుగా భావించటం, ఆయన బోధనలకు ఆకర్షితులు కావటం. అందువల్ల చాలా చోట్ల అన్నదానాలు కూడా నిర్వహిస్తారు. ఇవాళ కొందరు శిష్యులు తమ గురువులకు బహుమతులను, కానుకలను సైతం ఇచ్చి సత్కరిస్తారు. మరికొందరు రోజంతా ఉపవాసం చేస్తారు. కొన్ని చోట్ల గురు పూర్ణిమ పూజలను మూడు రోజుల వరకు కొనసాగిస్తారు. వర్షాల నేపథ్యంలో ఈసారి సాయిబాబా ఆలయాల్లో భక్తుల సంఖ్య కాస్త తగ్గింది.
కలంతో అక్షర సేద్యం చేయించేవాడైనా, హలంతో పొలం దున్ని పంట పండించడం నేర్పేవాడైనా, తెలియని విషయాలను తెలిపేవాడు ఎవరైనా గురువుతో సమానమే. అజ్ఞానం అనే చీకటిని పారదోలే శక్తే గురువు. అందుకే వెనకటికి గురువులేని విద్య గుడ్డి విద్య అన్నారు. కొందరికి అనుభవమే తిరుగులేని గురువుగా ముందుండి నడిపిస్తుంది. మరికొందరు వ్యక్తులు ఎదుటివాళ్లు చేసేదాన్ని చూసి నేర్చుకుంటారు. అలాంటప్పుడు ఆ ఎదుటివాళ్లను పరోక్ష గురువులుగా పేర్కొనొచ్చు. నేర్చుకోవాలనే మనసుంటే ప్రతిదీ మనకు గురువులాగే కనిపిస్తుంది. భగవంతుడు అన్ని చోట్లా ఉన్నట్లే గురువులేని చోటు కూడా లేదు.