ఏపీలో పెట్రోల్, డీజిల్ ధరలపై వ్యాట్ తగ్గించాలంటూ బీజేపీ నిరసనలకు పిలుపు ఇవ్వగా.. అధికార పార్టీ వైసీపీ కౌంటర్ ఎటాక్‌కు దిగింది. బీజేపీ తీరుపై ఏకంగా పత్రికలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చింది. ‘పెట్రోల్, డీజిల్ ధరలు పెంచింది ఎంత? తగ్గించింది ఎంత?’ అంటూ వైసీపీ ప్రభుత్వం ప్రశ్నించింది. లీటరు పెట్రోల్ ధరను రూ.100 దాటించి రూ.5, రూ.10 తగ్గించామని పెంచినోళ్లే నిరసన చేస్తామంటే ఇంతకంటే ఘోరం ఉందా? అని నిలదీసింది. ఇబ్బడి ముబ్బడిగా ధరలను పెంచి అరకొరగా తగ్గించి ధర్నాలు అంటూ బీజేపీ రాజకీయం చేస్తోందని మండిపడింది. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే ఉద్దేశంతోనే తాము ఈ ప్రకటన ఇస్తున్నట్లు వైసీపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
Read Also: అదృష్టం తలుపు తీసింది .. గంటలో రూ. 101 కోట్ల సంపాదన
కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై 3,35,000 కోట్ల రూపాయల పన్ను వసూలు చేసినప్పటికీ అందులో రాష్ట్రాలకు పంచింది కేవలం 19,745 కోట్లు మాత్రమేనని, అంటే కేవలం 5.8 శాతం మాత్రమే అని పేర్కొంది. వాస్తవానికి రాష్ట్రాలకు 41 శాతం వాటా పంచాల్సి ఉన్నప్పటికీ పెట్రో ఆదాయాన్ని డివిజబుల్ పూల్‌లోకి రాకుండా సెస్‌లు, సర్‌ఛార్జీల రూపంలో సుమారు రూ.2,87,500 కోట్ల రూపాయలు వసూలు చేసి ఆ మేరకు రాష్ట్రాలకు ఇవ్వాల్సిన వాటా తగ్గించిన విషయం వాస్తవం కాదా అంటూ వైసీపీ ప్రభుత్వం బీజేపీని నిలదీసింది. 2019 మేలో లీటరు పెట్రోల్ ధర రూ.76.89గా ఉంటే.. 2021 నవంబరు 1 నాటికి రూ.115.99కు చేరలేదా? అని ప్రశ్నించింది.
తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇబ్బడి ముబ్బడిగా వర్షాలు కురవడంతో రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా మారిందని.. దీంతో రూ.2,205 కోట్లతో రోడ్లను బాగుచేస్తున్నామని, ఇందుకోసం తమ ప్రభుత్వం ప్రత్యేకంగా లీటరు పెట్రోల్‌పై కేవలం ఒక్క రూపాయి మాత్రమే సుంకంగా వసూలు చేస్తున్నట్లు పత్రికా ప్రకటనల ద్వారా వైసీపీ ప్రభుత్వం వివరణ ఇచ్చింది.
