నేడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా సూపర్‌స్టార్ కృష్ణతో పాటు పలువురికి సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా గుర్తింపు పొందని స్వాతంత్ర సమర యోధులను గుర్తించాలని మోడీ ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన తెలిపారు. బ్రిటిష్ వారికి వణుకు పుట్టించిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, అల్లూరి లేకపోతే మనలో ఆ తెగింపు రాదు అని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. అత్యధికంగా దేశం కోసం పోరాటం చేసిన తెలుగు వ్యక్తి అల్లూరి సీతారామరాజు అని ఆయన కొనియాడారు.
విశాఖ పట్టణం జిల్లా లంబసింగిలో 38 కోట్లతో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఏర్పాటు చేస్తున్నామన్నారు. అల్లూరి 125 వ జయంతి సందర్భంగా మ్యూజియం పూర్తి చేస్తామని, ఈ నెల 13న అల్లూరి సొంతూరికి ఆయన వెళ్తానన్నారు. హైదరాబాద్‌లో అల్లూరి మ్యూజియం ఏర్పాటు కి 18 కోట్లు కేటాయించామని, ఢిల్లీ లో తెలుగువాడి చరిత్ర తెలియడానికి విజ్ఞాన భవన్‌లో అద్భుత కార్యక్రమం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు. స్వాతంత్రం కోసం పోరాటం చేసిన గిరిజన వీరుల గుర్తింపు కోసం తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడుతానన్నారు.