తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదు. ఎందుకంటే ఆ పార్టీకి కేసీఆర్ రూపంలో బలమైన సీఎం ఉన్నారు. కానీ ప్రతిపక్ష పార్టీలలో బలమైన సీఎం అభ్యర్థులు లేకపోవడం వల్లే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ పార్టీని ఆదరించి అక్కున చేర్చుకుంటున్నారు. ఉదాహరణకు కాంగ్రెస్ పార్టీని తీసుకుంటే ఆ పార్టీలో చెప్పుకోవడానికి చాలా మంది సీనియర్ నేతలు, సీఎం అభ్యర్థులు ఉన్నారు కానీ ప్రజల్లో చరిష్మా ఉన్న నేత లేరనే చెప్పాలి.
కాంగ్రెస్ పార్టీకి ప్రస్తుతం రేవంత్ రెడ్డి సీఎం అభ్యర్థిగా కనిపిస్తున్నా… ఎన్నికల సమయంలో ఆయన్ను అధిష్టానం సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఆ పార్టీ సీనియర్లు ఎంతమేరకు అంగీకరిస్తారో వేచి చూడాలి. అయితే కాంగ్రెస్‌లో ఉన్నన్ని రాజకీయాలు లేకున్నా… బీజేపీ పరిస్థితి కూడా ఇంచుమించూ ఇంతే. కిషన్ రెడ్డి, బండి సంజయ్, దత్తాత్రేయ.. ఇలా చాలా మంది ఉన్నా వారు సీఎం అభ్యర్థి అంటే ప్రజల ఓట్లు వారికి పడతాయా అంటే సందేహమే.
Read Also: హుజురాబాద్ బైపోల్: గెలుపు క్రెడిట్ ఈటలదా? బీజేపీదా?
సాధారణంగా ఏ రాష్ట్రాలలోనూ జాతీయ పార్టీలు సీఎం అభ్యర్థులను ముందుగా ప్రకటించిన దాఖలాలు ఎక్కడా కనిపించవు. ఎన్నికల తర్వాత గెలిస్తేనే జాతీయ పార్టీలు సీఎం అభ్యర్థులను ఖరారు చేస్తుంటాయి. అయితే ఈటల ఎంట్రీతో తెలంగాణ బీజేపీలో ఎప్పుడూ లేనంత జోష్ కనిపిస్తోంది. హుజురాబాద్ ఉప ఎన్నికలో ఆయన గెలుపుతో బీజేపీకి నూతన ఉత్సాహం వచ్చినట్లు అయ్యింది. ఇప్పటివరకు చరిష్మా ఉన్న నేత కోసం చూస్తున్న ఆ పార్టీకి అలాంటి నేత ఈటల రూపంలో దొరికాడని పలువురు భావిస్తున్నారు.
అయితే ఈటల రాజేందర్ వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు ఏ పార్టీలో ఉంటారన్న సంగతి పక్కన బెడితే.. బీజేపీలో ఉంటే మాత్రం ఆయన సీఎం అభ్యర్థి తప్పకుండా అవుతారనే టాక్ వినిపిస్తోంది. ఉద్యమ నేత కావడం, రాష్ట్ర ఆర్థిక మూలాలు తెలిసిన వ్యక్తి కావడం, ప్రజలతో కలుపుగోలుగా ఉండటం, పార్టీ శ్రేణులను బలోపేతం చేసే వ్యక్తి కావడంతో బీజేపీకి ఆయనే సీఎం అభ్యర్థి అన్న వాతావరణం కనిపిస్తోంది. కేసీఆర్‌ను ఢీకొట్టే సత్తా కేవలం బీజేపీలో ఈటలకే ఉందని పలువురు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఈటలలో ఉన్నాయి.
Read Also: హుజూరాబాద్‌లో టీఆర్‌ఎస్ ఓటమికి కారణాలు..!
రాజకీయ విలువలు, నిబద్ధతతో కూడిన రాజకీయాలు చేసే ఈటలకు సీఎం అభ్యర్ధి అయ్యే అర్హతలు ఉన్నాయని, వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు కనుక బీజేపీ అధిష్టానం ముందుగానే ఈటలను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే… ఆ పార్టీకి ఎంతో అడ్వాంటేజ్ అవుతుందని పలువురు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చినా, రాకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలో అయితే బీజేపీకి మంచి ఫలితాలు వస్తాయని వారు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి హుజురాబాద్ ఉప ఎన్నికతో కేసీఆర్‌కు లాభం కలగకపోగా… ఆయన వద్దనుకున్న నాయకుడే భవిష్యత్‌లో గుదిబండలా మారబోతున్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.