లాక్‌డౌన్ పుణ్యమా అని దేశంలో ఓటీటీలు రాజ్యమేలుతున్నాయి. గత రెండేళ్లలో జనాలపై ఓటీటీల ప్రభావం పెరిగింది. దీంతో అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్, జీ5, ఆహా, సన్ నెక్ట్స్ వంటి ఓటీటీలు లాభాల బాటలో దూసుకుపోతున్నాయి. అయితే 2021 త్రైమాసికంలో దేశంలో ఎక్కువ మంది వీక్షిస్తున్న ఓటీటీలపై ‘జస్ట్ వాచ్’ అనే స్ట్రీమింగ్ గైడ్ సర్వీస్ రివ్యూ చేసింది. ఈ రివ్యూలో డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది రెండో త్రైమాసికంతో పోలిస్తే రెండు శాతం వృద్ధిని డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సంస్థ సాధించడం విశేషం.
Read Also: రేపిస్టులకు హెచ్చరిక… రేప్ చేస్తే ఇకపై అది ఉండదట
అయితే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అగ్రస్థానంలో నిలవడానికి పలు అంశాలు దోహదం చేస్తున్నాయి. హాట్ స్టార్ ఇటీవలే ఒరిజినల్ షోలు స్ట్రీమ్ చేయడంతో పాటు సినిమాలను కూడా అగ్రెసివ్‌గా కొనడం ప్రారంభించింది. ముఖ్యంగా స్టార్ నెట్‌వర్క్‌లో ప్రసారమయ్యే క్రీడల కోసం అభిమానులు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓటీటీ యాప్‌ను వినియోగిస్తున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్, టీ20 వరల్డ్ కప్ వంటి టోర్నీలను క్రీడాభిమానులు ఎక్కువగా వీక్షించినట్లు సమాచారం. మరోవైపు సీరియల్స్, కొత్త కొత్త సినిమాలు, డిస్నీ సినిమాలు కూడా హాట్‌స్టార్ అభిమానులకు మంచి ఛాయిస్‌గా నిలిచాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది జనవరి నుంచి హాట్ స్టార్ మార్కెట్ షేర్ ఐదు శాతం పెరిగింది. ఈ జాబితాలో హాట్‌స్టార్ తర్వాతి స్థానంలో అమెజాన్ ప్రైమ్ నిలిచింది. నెట్‌ఫ్లిక్స్ మూడో స్థానంలో నిలవగా.. జీ5 నాలుగో స్థానంలో ఉంది. వూట్ ఐదో స్థానాన్ని సంపాదించుకోగా.. సోనీలివ్, జియో సినిమా ఆరు, ఏడు స్థానాల్లో ఉన్నాయి. ఆల్ట్ బాలాజీ ఈ జాబితాలో ఎనిమిదో స్థానంలో నిలిచింది.