దేశవ్యాప్తంగా ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలపై వివాదం నడుస్తోంది. దీనికి ఆజ్యం పోసింది ముమ్మాటికీ కేంద్ర ప్రభుత్వం అనే చెప్పాలి. దేశంలో పెట్రోల్ ధరలు ఇటీవల కాలంలో భారీగా పెరిగాయి. 2019 మేలో లీటర్ పెట్రోల్ ధర రూ.76.89 ఉంటే ఇటీవల ఆ ధర రూ.116కి చేరింది. అంటే రెండేళ్లలోనే లీటర్ పెట్రోల్ ధర దాదాపుగా రూ.40 పెరిగింది. దీంతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైనా విమర్శలు పెరిగాయి. ఈ ప్రభావం ఇటీవల దేశవ్యాప్తంగా జరిగిన ఉప ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. పోటీ చేసిన సగానికి పైగా స్థానాల్లో బీజేపీ ఘోరంగా ఓటమి పాలైంది. దీంతో కేంద్రంలోని బీజేపీ సర్కారు దిద్దుబాటు చర్యలకు దిగింది.
Read Also: కాంగ్రెస్‌లో ఏం జరుగుతోంది.. సీనియర్స్ వర్సెస్ రెబల్స్
ఉప ఎన్నికల ఫలితాలు వచ్చిన మర్నాడే దీపావళి కానుక పేరుతో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.10 ఎక్సైజ్ సుంకం తగ్గిస్తున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాట్ తగ్గించాలని కేంద్రం సూచించింది. ఈ నేపథ్యంలో కొన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు వ్యాట్ తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ముఖ్యంగా త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న పంజాబ్, ఉత్తరప్రదేశ్, గోవా సహా పలు రాష్ట్రాలలో లీటర్ పెట్రోల్ రేట్లు రూ.10 మేర తగ్గాయి. కానీ కొన్ని రాష్ట్రాలు మాత్రం నిధుల విషయంలో ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో వ్యాట్ తగ్గించడానికి ససేమిరా అంటున్నాయి.
వాస్తవానికి గత రెండేళ్లలో క్రూడాయిల్ ధర తగ్గినా పెట్రోల్ ధరలు మన దేశంలో మాత్రం తగ్గలేదు. క్రూడాయిల్ ధరలు పడిపోయిన సందర్భంలోనూ కేంద్ర ప్రభుత్వం లీటర్ పెట్రోల్‌పై రూ.13, డీజిల్‌పై రూ.16 వంతున ఎక్సైజ్ సుంకం విధించింది. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో 41 శాతం రాష్ట్రాలకు పంచాల్సి ఉంటుంది. కానీ మోదీ సర్కారు తెలివిగా పెట్రోలియం రంగంపై వచ్చే ఆదాయం డివిజబుల్ పూల్‌లోకి రాకుండా చర్యలు తీసుకుంది. సెస్‌లు, సర్‌ఛార్జీలు రూపంలో పన్నులు వసూలు చేస్తూ ఆ ఆదాయాన్ని రాష్ట్రాలకు పంచకుండా తనే వినియోగించుకునేలా ఎత్తులు వేసింది. దీంతో రాష్ట్రాలకు భారీ స్థాయిలో ఆదాయానికి గండి పడింది. అందుకే ఇప్పుడు కేంద్రం వ్యాట్ తగ్గించాలని చెప్పినా.. పలు రాష్ట్రాలు తమకు ఆదాయం పడిపోతుందనే ఉద్దేశంతో వ్యాట్ తగ్గించడానికి ఇష్టపడటం లేదు.
2014-15లో పెట్రోలియం రంగంలో పన్నుల ద్వారా కేంద్రానికి రూ.1.72 లక్షల కోట్లు వస్తే ప్రస్తుతం ఆ ఆదాయం రూ.3.35 లక్షల కోట్లకు చేరింది. ఇందులో రాష్ట్రాల వాటా రూ.19,475 కోట్లు మాత్రమే. మిగతా ఆదాయం అంతా కేంద్రం చేతుల్లోనే ఉంటోంది. అసలే కరోనా దెబ్బతో రాష్ట్రాల ఆదాయం గణనీయంగా పడిపోయింది. ఇప్పుడు పెట్రోల్ ద్వారా వచ్చే ఆదాయంలో కోత విధించుకోమంటే దానిని భరించేందుకు తాము సిద్ధంగా లేమంటూ రాష్ట్ర ప్రభుత్వాలు వాదిస్తున్నాయి. కరోనా ముందు నాటితో పోలిస్తే పెట్రోలియం ఉత్పత్తుల ద్వారా కేంద్రానికి 79 శాతం ఆదాయం పెరిగినట్లు కొన్ని అధికారిక గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.
Read Also: ఏడోవార్డు అంటే భయం.. పోటీచేస్తే అంతేనా?
అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడాయిల్ ధరలు పెరగకున్నా కేంద్ర ప్రభుత్వం అడ్డదిడ్డంగా ట్యాక్సులను పెంచి పెట్రోల్ ధరలు పెరగడానికి కారణమైందని.. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలను బూచిగా చూపెట్టడం సరికాదని తెలుగు రాష్ట్రాలు అభిప్రాయపడుతున్నాయి. పెట్రోల్ రేట్లను కొండంత పెంచి పిసరంత తగ్గించి తామేదో ఘనకార్యం చేసినట్లు కేంద్ర ప్రభుత్వం డప్పు కొట్టుకోవడం విచిత్రంగా ఉందని ఆయా ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. జీఎస్టీ, ఇంకమ్ ట్యాక్సుల రూపంలో కేంద్రానికి ఆదాయం భారీగానే సమకూరుతోందని.. అందువల్ల పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం వసూలు చేస్తున్న సెస్‌లన్నీ తగ్గించుకుంటే లీటర్ పెట్రోల్ రూ.77కి వస్తుందని తెలంగాణ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. అటు ఉప ఎన్నికల ఫలితాల ప్రభావంతోనే కేంద్ర ప్రభుత్వం స్వల్పంగా పెట్రోల్ ధరలు తగ్గించిందని ఏపీ మంత్రి పేర్ని నాని విమర్శలు చేశారు. దేశంలోని 14 రాష్ట్రాలలో పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకు తగ్గించలేదో బీజేపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. పెట్రోల్ ధరలు తగ్గించాలని బీజేపీ నేతలు ఢిల్లీ వెళ్లి ధర్నాలు చేస్తే తాను కూడా వచ్చి పాల్గొంటానని పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు.