20 ఏళ్లుగా అమెరికా, నాటో దళాల సంరక్షణలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్ ఇప్పుడు పూర్తిగా తాలిబన్ల చేతిలోకి వెళ్లిపోయింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి అమెరికా బలగాలు పూర్తిగా తప్పుకున్నాక తాలిబన్లు ఎయిర్‌పోర్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాలిబన్ల ప్రభుత్వం అధికారంలో ఉన్నది. తాత్కాలిక శాఖలను ఏర్పాటు చేసి మంత్రులను నియమిస్తోంది. పూర్తిస్థాయిలో ప్రభుత్వం ఏర్పడిన తరువాత తాలిబన్లు ఎలా పరిపాలించబోతున్నారు అన్నది ఉత్కంఠంగా మారింది. తాలిబన్ల చెరలోకి ఆఫ్ఘన్ వెళ్లిన వెంటనే విదేశీ నిథులను అమెరికా ఫ్రీజ్ చేసింది. 9 బిలియన్ డాలర్ల విదేశీ మారక నిల్వలను ఫ్రీజ్ చేయడం తాలిబన్లకు ఎదురుదెబ్బ అని చెప్పాలి. ఆఫ్ఘన్ ఆర్థిక వ్యవస్థ చాలా వరకు విదేశాల నుంచి వచ్చే నిధులపై ఆధారపడి ఉంటుంది. ఆఫ్ఘనిస్తాన్‌లో సహజవనరులు ఉన్నప్పటికీ వాటిని వినియోగించుకోవడానికి తగినన్ని వసతులు లేవు. పైగా నిత్యం ప్రభుత్వానికి, ముష్కరులకు మధ్య ఘర్షణలు చోటుచేసుకొవడంతో అభివృద్ధి మచ్చుకైనా కనిపించలేదు. గత 20 ఏళ్ల కాలంలో నాటో దళాలు ఆఫ్ఘన్ రక్షణ బాధ్యతలు తీసుకొవడంతో ప్రజాపాలన సాగింది. ఇప్పుడు తాలిబన్ల పాలనలోకి రావడంతో ఆ దేశంలోని అనేక ఉగ్రవాద సంస్థలు తిరిగి వాటి ప్రాబల్యం చూపే అవకాశం ఉన్నది. ముష్కరుల ఆదిపత్యం పోరులో ఆఫ్ఘన్ ప్రజలు ఇబ్బందులు పడాల్సి రావొచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు, వార్‌ఫైటర్స్‌కు, తాలిబన్ నేతలకు మధ్య పొంతన లేదని స్పష్టంగా అర్ధం అవుతున్నది. మహిళలను ఎలా గౌరవించాలో తమ ఫైటర్స్‌కు తెలియదని, వారికి ట్రైనింగ్ ఇస్తామని, అప్పటి వరకు మహిళలు ఇంట్లో నుంచి బయటకు రావొద్దని అంటున్నారు అంటే వారిలో వారికే సరైన కమాండింగ్ లేదని స్పష్టంగా అర్ధం అవుతున్నది. ఆమెరికా వదిలేసిన ఆఫ్ఘన్ భవితవ్యం ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు. తాలిబన్ల ముందున్న సవాళ్లను అధికమిస్తుందా…? సుపరిపాలన అందిస్తుందా చూడాలి.
Read: ఏపీ కరోనా అప్డేట్: మళ్లీ పెరిగిన కేసులు…