(సెప్టెంబర్ 22న విజయబాపినీడు జయంతి)
నలుగురు నడిచే బాటలో నడిస్తే మేలని చాలామంది భావన; మనమే కొత్త మార్గం చూపిస్తే బాగుంటుందని ఇంకొందరి ఆలోచన. రెండోరకం వారే ప్రత్యేకత సంతరించుకుంటూ ఉంటారు. నిర్మాత, దర్శకుడు విజయబాపినీడు ఆ రెండోరకానికి చెందినవారే. ఆయన ఏది చేసినా, అందులో వైవిధ్యం ఉండాలని తపించేవారు. రచయితగా, చిత్ర నిర్వాహకునిగా, నిర్మాతగా, దర్శకునిగా బాపినీడు సాగిన తీరు మరపురానిది. విజయబాపినీడు పేరు వినగానే సినీ ఫ్యాన్స్ కు ‘శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్’ చప్పున గుర్తుకు వస్తుంది. ఇక పాఠకులకు అయితే ఆయన నడిపిన ‘బొమ్మరిల్లు’ బాలల పత్రిక, ‘విజయ’ మాస పత్రిక స్ఫురిస్తాయి. బాపినీడు దర్శకత్వంలో రూపొందిన అనేక తెలుగు చిత్రాలు జనాన్ని విశేషంగా ఆకట్టుకున్నాయి.
విజయబాపినీడు అసలు పేరు గుత్తా బాపినీడు చౌదరి. 1936 సెప్టెంబర్ 22న ఏలూరు తాలూకా చాటపర్రులో జన్మించారు బాపినీడు. ఏలూరు సి.ఆర్.ఆర్. కళాశాలలో బి.ఏ. మేథమేటిక్స్ చదివారు. చదువుకొనే రోజుల నుంచీ కథలు, నాటకాలు రాయడం అలవాటున్న బాపినీడు, డిగ్రీ చేతికి రాగానే మద్రాసు చేరారు. అక్కడ ‘అపరాధ పరిశోధన’ మాసపత్రికలో పలు సస్పెన్స్ థ్రిల్లర్స్ రాసి పాఠకులను ఆకట్టుకున్నారు. మిత్రుల సహకారంతో కొన్ని శృంగార పత్రికలూ నడిపారు. ఆ పై బాలల కోసం ‘బొమ్మరిల్లు’ మాసపత్రికను నెలకొల్పారు. తెలుగునాట ‘చందమామ’ తరువాత అంతటి ఆదరణ పొందింది ‘బొమ్మరిల్లు’. ఈ బాలల మాస పత్రికతో పాటు ప్రతి నెలా పిల్లలను ఆకట్టుకొనే బహమతులు పెట్టారు బాపినీడు. పిల్లలతోనే కథలు రాయించేందుకు శ్రీకారం చుట్టారు. అలా ’80, ధనలక్ష్మీ కాలనీ, మదరాసు’ అనే బొమ్మరిల్లు చిరునామా అప్పట్లో విశేష ప్రాచుర్యం సంపాదించింది. తరువాత ‘విజయ’ మాస పత్రికను కూడా విజయవంతంగా నడిపారు. ఆ పత్రిక పేరే ఆయన ముందు చేరి, విజయబాపినీడు అయ్యారు. ఆ రోజుల్లో ‘విజయ’ మాస పత్రికలో సినిమా కోసం ఓ స్పెషల్ బుక్ లెట్ ఉండేది. అందులో రివ్యూకు పాయింట్స్ వేసేవారు. దాంతో సినీ ఫ్యాన్స్ అందరూ ‘విజయ’ పుస్తకం కోసం కళ్ళు ఇంతలు చేసుకొని చూసేవారు.
మాగంటి రవీంద్రనాథ్ చౌదరి సహకారంతో సినిమా నిర్మాణానికి శ్రీకారం చుట్టారు విజయబాపినీడు. అప్పట్లో విలక్షణ దర్శకునిగా పేరు సంపాదించిన దాసరి నారాయణ రావు దర్శకత్వంలో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్ప్ పతాకంపై ‘యవ్వనం కాటేసింది’ చిత్రాన్ని నిర్మించారు మాగంటి రవీంద్రనాథ్ చౌదరి. ఆ సినిమాకు నిర్వహణ బాధ్యతలు విజయబాపినీడు తీసుకున్నారు. అప్పటి నుంచీ ‘శ్యామ్ ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్’ పతాకంపై రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన చిత్రాలన్నిటికీ నిర్మాణతగా విజయబాపినీడు పేరు ఉండేది. ‘రంభ ఊర్వశి మేనక’, ‘మరో అహల్య’ వంటి చిత్రాలు కూడా నిర్మించారు. తమ ప్రాంతానికి చెందిన మురళీమోహన్ ను హీరోగా నిలపడంలోనూ విజయబాపినీడు పాత్ర ఎంతయినా ఉందని చెప్పక తప్పదు. మురళీమోహన్ హీరోగా శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ పతాకంపై “బొమ్మరిల్లు, విజయ, బొట్టు-కాటుక” వంటి చిత్రాలు తెరకెక్కించారు. తరువాత చిరంజీవి, మోహన్ బాబు తో ‘పట్నం వచ్చిన పతివ్రతలు’ చిత్రాన్ని మౌళి దర్శకత్వంలో నిర్మించారు. ఆ సమయంలోనే చిరంజీవి సోలో హీరోగా ఓ చిత్రం రూపొందించాలని ప్రణాళిక వేశారు. అదే ‘మగమహారాజు’. ఈ చిత్రంతోనే విజయబాపినీడు దర్శకునిగా తొలిసారి మెగాఫోన్ పట్టారు.
‘మగమహారాజు’ మంచి విజయం సాధించింది. ఆ సినిమా అయ్యాక విజయబాపినీడు దర్శకత్వంలో ‘హీరో’ చిత్రం నిర్మించారు అల్లు అరవింద్. ఇది కూడా మంచి వసూళ్ళు చూసింది. ఆ తరువాత చిరంజీవితో శ్యామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై ‘మహానగరంలో మాయగాడు’ తీశారు బాపినీడు. ఇదే పతాకంపై చిరంజీవి హీరోగా విజయబాపినీడు దర్శకత్వంలో “మగధీరుడు, ఖైదీ నంబర్ 786, గ్యాంగ్ లీడర్, బిగ్ బాస్” చిత్రాలు తెరకెక్కాయి. చివరి ‘బిగ్ బాస్’ మినహాయిస్తే, అన్నీ చిరంజీవికి విజయాలనే అందించాయి. శోభన్ బాబు హీరోగా విజయబాపినీడు దర్శకత్వంలో రూపొందిన ‘మహరాజు’ మంచి విజయం సాధించింది. ఆయన దర్శకత్వంలో తెరకెక్కిన “భార్యామణి, జూ లకటక, నాకూ పెళ్ళాం కావాలి, వాలు జడ – తోలు బెల్టు” వంటి చిత్రాలు సైతం అలరించాయి. బాపినీడు దర్శకత్వంలో రూపొందిన చివరి చిత్రం ‘కొడుకులు’ 1998లో విడుదలయింది. ఏది ఏమైనా విజయబాపినీడు కెరీర్ లో బిగ్ హిట్ అంటే ‘గ్యాంగ్ లీడర్’ అనే చెప్పాలి. చిరంజీవితో ఓ చిత్రం రూపొందించాలని తరువాత రోజుల్లో బాపినీడు తపించారు. అందుకోసం అభిమానులనే రచయితలుగా మార్చారు. అలా రూపొందిన కథలతో హైదరాబాద్ లోని విజయబాపినీడు గెస్ట్ హౌస్ సగం నిండిపోయింది అంటే అతిశయోక్తి కాదు. అయితే అప్పుడు ఇప్పుడు అంటూనే కాలయాపన సాగింది. తరువాత వయసు మీద పడడంతో చిరంజీవితో సినిమా తీయలేకపోయారు విజయబాపినీడు. 2019 ఫిబ్రవరి 11న విజయ బాపినీడు కన్నుమూశారు. ఇప్పటికీ ఆయన పేరు వినగానే ‘బొమ్మరిల్లు, విజయ’ పత్రికలు “మగమహారాజు, గ్యాంగ్ లీడర్” వంటి చిత్రాలు గుర్తుకు వస్తూనే ఉంటాయి.