గత శుక్రవారం ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ వెబ్ సీరిస్ ను స్ట్రీమింగ్ చేసిన ఆహా ఓటీటీ సంస్థ ఈ వారం ఏకంగా రెండు సినిమాలను స్ట్రీమింగ్ చేయబోతోంది. అయితే ఆ రెండూ కూడా తమిళ అనువాద చిత్రాలు కావడం విశేషం. ఆర్జే బాలాజీ హీరోగా నటించిన పొలిటికల్ సెటైర్ మూవీ ‘ఎల్.కె.జి.’ 2019 ఫిబ్రవరిలో విడుదలైంది. ప్రియా ఆనంద్ హీరోయిన్ గా నటించిన ఈ మూవీని కె. ఆర్. ప్రభు దర్శకత్వంలో ఇషారీ కె గణేశ్ నిర్మించాడు. తెలుగులోనూ ‘ఎల్.కె.జి.’ పేరుతోనే డబ్ చేసి, 25వ తేదీ శుక్రవారం ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు. దీని ట్రైలర్ ను మంగళవారం విడుదల చేశారు.
Read Also : 13 ఏళ్లప్పుడు చేసిన ‘ఆ తప్పు’కి… 19 ఏళ్ల సింగర్ ‘సారీ’ చెప్పింది!
తాజాగా మరో తమిళ సినిమా ‘జీవి’ని సైతం అదే పేరుతో డబ్ చేసి, ఈ శుక్రవారమే ‘ఆహా’లో స్ట్రీమింగ్ చేస్తున్నారు. వి.జె. గోపీనాథ్ దర్శకత్వం వహించిన ఈ థ్రిల్లర్ మూవీకి బాబు తమిళ రచన చేశారు. వెట్రీ ప్రధాన పాత్ర పోషించిన ఈ సినిమాలో కరుణాకరన్, మోనిక చిన్నకొంట్ల, రోహిణి, అశ్విని చంద్రశేఖర్, మైమ్ గోపీ కీలక పాత్రలు పోషించారు. మధురై నుండి చెన్నయ్ వచ్చిన శరవణన్ కు సిటీలో టీ మాస్టర్ మణి పరిచయం అవుతాడు. తన ఆర్థిక పరిస్థితి చూసి ప్రియరాలు ఆనంది కించపరచడంతో ఎలాగైనా డబ్బు సంపాందించాలని శరవణన్ డిసైడ్ అవుతాడు. ఆ తర్వాత అతని జీవితం ఎలాంటి మలుపులు తిరిగిందన్నదే ఈ చిత్ర కథ. తమిళంలో విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో పాటు చక్కని విజయాన్ని అందుకుందీ సినిమా. ఇది కూడా 2019లోనే అక్కడ విడుదలైంది. శుక్రవారం ఈ సినిమా ‘ఆహా’ స్ట్రీమింగ్ కాబోతున్న దృష్ట్యా బుధవారం ట్రైలర్ ను విడుదల చేశారు.