ఒకవైపు వర్షాలు.. విరిగిపడుతున్న కొండచరియలతో తిరుమల వెళ్ళే భక్తులకు ఇబ్బందులు తప్పడంలేదు. గురువారం రాత్రి 8 గంటలకు రెండు ఘాట్ రోడ్ల మూసివేస్తున్నట్టు ప్రకటించింది టీటీడీ. తిరిగి రేపు ఉదయం 6 గంటల నుంచి వాహనాలను ఘాట్ రోడ్డు లో అనుమతి ఇస్తామని ప్రకటించింది. ఘాట్ రోడ్డులో పలు ప్రాంతాలు కొండచరియలు విరిగిపడుతుండడంతో ముందస్తు జాగ్రత్తగా మొదటి ఘాట్ రోడ్డు మూసివేస్తోంది టీటీడీ. తిరుమల నుంచి తిరుపతికి వెళ్ళే భక్తులు 7 గంటలలోపు ప్రయాణం చెయ్యాలని విజ్ఞప్తి చేసింది టీటీడీ.
తిరుమలలో భారీ వర్షం కురిసింది. దీంతో అవస్థలు పడుతున్నారు భక్తులు. బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో వానలు దంచికొడుతున్నాయి. కార్తిక మాసం కావడంతో భక్తులు తిరుమలకు క్యూ కడుతున్నారు. రోజూ 30 వేలమంది భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. వర్షాల వల్ల భక్తుల రాకపోకలపై టీటీడీ ఆంక్షలు విధిస్తోంది.
చిత్తూరు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున రేపు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు,కళాశాల లకు సెలవు ప్రకటించారు జిల్లా కలెక్టర్ హరి నారాయణన్. చెన్నై – శ్రీహరికోట మధ్యలో తీరానికి అతి సమీపంలో వాయుగుండం వుందని వాతావరణ శాఖ తెలిపింది. తిరుపతి , శ్రీకాళహస్తి , సూళ్లూరుపేట పై పెను ప్రభావం చూపుతోంది. తీరాన్ని తాకిన రెండు గంటల తరువాత తీరం దాటనుంది వాయుగుండం. దీంతో నెల్లూరు, చిత్తూరు జిల్లా యంత్రాంగాలను అప్రమత్తం చేశారు అధికారులు.
ఇదిలా వుండగా… శనివారం అండమాన్ సముద్రంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు అది ఈ నెల 17న దక్షిణకోస్తాంధ్ర వద్ద తీరందాటే అవకాశాలున్నాయని ప్రాథమిక అంచనాగా తెలిపారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు.