వరి ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర వర్సెస్ తెలంగాణ ప్రభుత్వంగా మారిపోయింది పరిస్థితి.. యాసంగిలో వరి కొనే పరిస్థితి లేదని కేంద్రం తేల్చేయడంతో.. ప్రత్యామ్నాయ పంటలపై ఫోకస్ పెట్టాలని రైతులకు సూచిస్తోంది తెలంగాణ సర్కార్.. మరోవైపు.. ప్రతీ గింజా రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు రాష్ట్ర బీజేపీ నేతలు.. కేంద్రం కొనదు కానీ, రాష్ట్ర నేతలు ఇలా మాట్లాడడం ఏంటి? అంటూ టీఆర్ఎస్ మండిపడుతోంది.. ఈ తరుణంలో.. అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారిపోయాయి.. యాసంగిలో రైతులు వరి సాగు చేస్తే మంచి ధరకు కొనుగోలు చేయించే బాధ్యత తనదేనంటూ ప్రకటించారు టీఆర్ఎస్ పార్టీకి చెందిన మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు.
మిర్యాలగూడతో పాటు నాగార్జునసాగర్ నియోజకవర్గంలో రైతులు యాసంగిలో సన్న ధాన్యం పండిస్తే.. మంచి ధరకు మిల్లర్లతో పంటను కొనుగోలు చేయించేలా చూస్తానంటూ భరోసా ఇచ్చారు టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు.. ఈ విషయంలో ఎవరు ఏం చెప్పినా అయోమయానికి గురికావాల్సిన అవసరం లేదని సూచించిన ఆయన… వరి సాగు కోసం నాగార్జునసాగర్ ఎడమకాల్వకు నీటిని కూడా విడుదల చేయిస్తానని హామీ ఇచ్చారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై ఇప్పటికే రైస్ మిల్లర్లతో చర్చించామని తెలిపారు.. మరోవైపు.. మెట్టపంటలు అవకాశం ఉన్న రైతులు మాత్రం ప్రత్యామ్నాయ పంటలు పండించాలని కోరారు ఎమ్మెల్యే.. ఇక, కాంగ్రెస్, బీజేపీ నేతలపై మండిపడ్డ భాస్కర్‌రావు.. ఏనాడై నా రైతులు పొలాల్లో నాట్లు వేయడం, కోతలు కోయడం చూశారా? అంటూ ప్రతిపక్షాలపై మండిపడ్డారు.. ఓవైపు ఇప్పటికే మార్కెట్లకు చేరిన పంటను కొనడంలేదని విమర్శలు ఉన్నాయి.. కల్లాలు, రోడ్లపై కూడా ఎక్కడపడితే అక్కడ వరి ధాన్యం దర్శనమిస్తోంది.. కేంద్ర, రాష్ట్రాల వైఖరితో వరి కొనుగోళ్లలో గందరగోళ పరిస్థితి నెలకొంది.. ఈ తరుణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే భాస్కర్‌రావు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.